Thursday, February 6, 2020

ఆర్టికల్‌ 370పై ఇంత రచ్చా?

ఆర్టికల్‌ 370పై ఇంత రచ్చా?
07-02-2020 03:19:40

తెలంగాణ ఏర్పాటు నాడు చర్చే లేదు..
పార్లమెంట్‌ను బంద్‌ చేసి చర్చకు కత్తెరేశారే..!
నాడు నిరసనల్ని మన్మోహన్‌ తప్పుపట్టలేదా?
సీఏఏపై అసలు కాంగ్రెస్‌ వైఖరేంటి?: మోదీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ సాగుతున్న అల్లర్లు అరాచకానికి చిహ్నమని ప్రధాని నరేంద్ర మోదీ నిశితంగా విమర్శించారు. ‘పార్లమెంటు, అసెంబ్లీల్లో తీసుకునే నిర్ణయాలపై రోడ్లెక్కి రోజుల తరబడి నిరసన ప్రదర్శనలు చేయడం అరాచకమే. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలు చేసే ఓ చట్టాన్ని ప్రజలు నిరసించి ఆందోళనలకు దిగితే ఏం జరుగుతుందో ఊహించారా? దేశాన్ని ఇలానేనా నడిపేది? దీని వల్ల మాకే కాదు, మీకూ (విపక్షానికీ) ఇబ్బందే. దేశం గురించి అంతా పట్టించుకోవాలి. అందుకే మనల్ని ఇక్కడకు పంపారు. దేశంలోని మెజారిటీ ఎంపీలు ఆమోదించిన చట్టమిది. దాన్ని ఉపసంహరించాలా? ఇది ఆందోళనకరం’’ అని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై గురువారం పార్లమెంటు ఉభయసభల్లో విడివిడిగా ఇచ్చిన సమాధానంలో ప్రధాని పేర్కొన్నారు. శనివారంనాడు జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా మోదీ ప్రసంగం సాగింది. షాహీన్‌బాగ్‌లో రోజుల తరబడి సాగుతున్న నిరసన హోరును పరోక్షంగా ప్రస్తావించారాయన. సీఏఏను ఆయన గట్టిగా సమర్థించుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినవారు ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ముస్లింల్లో లేనిపోని భ్రమలు, భయాలు కల్పించి ఈ ఆందోళనలు రెచ్చగొడుతున్నారన్నారు. ‘1950లో నాటి ప్రధాని పండిట్‌ నెహ్రూ అసోం తొలి ముఖ్యమంత్రి గోపీనాథ్‌ బార్డోలాయ్‌కి ఓ లేఖ రాశారు. ప్రాణాలరచేత పట్టుకుని పాకిస్థాన్‌ నుంచి వచ్చిన హిందువులను శరణార్థులుగా, ముస్లింలను వలసవాదులుగా చూడాలని, ఇద్దరి మధ్యా తారతమ్యం ఉండాలని అందులో పేర్కొన్నారు. అవసరమైతే చట్టాలు కూడా సవరించాలని కోరారు. అంటే నెహ్రూ ను మతవాది అనగలమా? ఆయన హిందూ రాష్ట్రాన్ని కోరుకున్నారా? కాంగ్రెస్‌ దీనికి బదులివ్వాలి’’ అని మోదీ నిలదీశారు.

ADVERTISEMENT

Learn More
POWERED BY PLAYSTREAM


తెలంగాణ గుర్తుకు రాలేదా..?
‘‘ఆర్టికల్‌ 370 నిర్వీర్యంపై అసలు చర్చే జరగలేదని గులాంనబీ ఆజాద్‌ అన్నారు. నేను అడుగుతున్నా....2014లో యూపీఏ హయాంలో తెలంగాణ ఏర్పాటు జరిగింది. దానిపై సభలో అసలు చర్చ జరిగిందా? పార్లమెంట్‌ను బంద్‌ చేసి చర్చకు కత్తెరేశారు. ఇపుడు ఆర్టికల్‌ 370 మీద మాత్రం ఇంత రచ్చ చేస్తున్నారు. ఆనాడు ఏపీ విభజనకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగినపుడు ఆ నిరసనను నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తప్పుపట్టారు. నేడు అవే నిరసనలను ఆయన పార్టీ సమర్థిస్తోంది’’ అని ప్రధాని దుమ్మెత్తారు. పార్లమెంట్లో సమగ్ర చర్చ జరిగిన తరువాతే కశ్మీర్‌పై నిర్ణయాలకు ఆమోదముద్ర పడిందన్నారు. ‘‘ప్రధాని పదవి కావాలన్న ఒకరి (నెహ్రూ) ఆకాంక్ష కోసం దేశ చిత్రపటం (మ్యాపు)లో ఓ గీత గీసి దేశాన్ని విడగొట్టేశారు’’ అని మోదీ సూటిగా దాడి చేశారు.
ఎన్‌పీఆర్‌ ప్రశ్నల్లో తప్పేంటి..?
జాతీయ పౌర పట్టిక(ఎన్‌పీఆర్‌)ను కూడా ప్రధాని గట్టిగా సమర్థించుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సరైన లబ్ధిదారులకు చేరవేయడానికి ఎన్‌పీఆర్‌ అప్‌డేషన్‌ ప్రక్రియ అత్యవసరమని, ఇది, జనగణన రొటీన్‌గా జరిగిపోయే పాలనాపరమైన ప్రక్రియలని పేర్కొన్నారు. 2010లో యూపీఏ హయాంలో తొలిసారి జరిగిందని, 2015లో అప్‌డేషన్‌ జరిగిందని చెబుతూ- నాడు వివాదాస్పదం కానివి నేడెలా అవుతాయని ప్రశ్నించారు. ‘ఎన్‌పీఆర్‌లో అడిగే ప్రశ్నలన్నీ పాలనాపరమైన అవసరాల కోసమే. వీటిని వ్యతిరేకించేవారు పేదల అభ్యున్నతికి వ్యతిరేకులని విమర్శించారు.
దెబ్బలు తట్టుకునేందుకు సూర్యనమస్కారాలు పెడతా!
‘‘ఈ మధ్య విపక్ష నేత (రాహుల్‌గాంధీ) ఓ మాటన్నారు. ‘వచ్చే ఆరునెలలు ఆగండి.. ప్రధాని తన ఇంటి నుంచి బయటకు కూడా రాలేరు. ఉద్యోగాలు కల్పించనందుకు ఈ దేశ యువత ఆయనను కర్రలతో కొడతారు’ అన్నారు. దీనికి నా సమాధానం ఒక్కటే. వచ్చే ఆరునెలలూ నా సూర్యనమస్కారాల సంఖ్య పెంచుకుంటా. ఎక్కువగా సూర్యనమస్కారాలు చేస్తే వెన్ను గట్టిపడుతుంది. సిద్ధంగా ఉంటాను’’ అని చమత్కరించారు. 2 దశాబ్దాలుగా దూషణలను ఎదుర్కొంటూనే ఉంటున్నానని చెప్పారు.

రాహుల్‌ పెద్ద ట్యూబ్‌లైట్‌!
సూర్య నమస్కారాల గురించి ప్రధాని చెప్పడానికి ముందు రాహుల్‌ లేచి ఏదో చెప్పబోయారు. వెంటనే ప్రధాని కౌంటర్‌ చేస్తూ- ‘30-40 నిమిషాలుగా మాట్లాడుతూనే ఉన్నాను. ఆ కరెంట్‌ ఇప్పటికి చేరిందండీ! చాలా ట్యూబ్‌లైట్లు ఇలానే ఉంటాయి’ అని వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment