Thursday, February 6, 2020

శాసనోల్లంఘనకు సిద్ధంకండి... : చిదంబరం

శాసనోల్లంఘనకు సిద్ధంకండి... : చిదంబరం
07-02-2020 10:36:29

న్యూఢిల్లీ: ఉమ్మడి జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలపై ప్రజా భద్రత చట్టం (పీఎస్ఏ)ను ప్రయోగించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎస్ఏ కింద ఇద్దరు మాజీ సీఎంలను గృహనిర్భందం చేయడం తనను కుంగుబాటుకు, షాక్‌కు గురిచేసిందన్నారు. ఈ మేరకు ఇవాళ వరుస ట్వీట్లతో కేంద్రాన్ని నిలదీయడంతో్ పాటు... ‘‘శాసనోల్లంఘన’’కు సిద్ధం కావాలంటూ చిదంబరం పిలుపునిచ్చారు.

‘‘ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా ఇతర నేతలపై పీఎస్ఏ చట్టాన్ని ప్రయోగించడం నన్ను తీవ్రంగా కలచివేసింది. షాక్‌కు గురిచేసింది. ప్రజాస్వామ్యంలో ఎలాంటి అభియోగాలు లేకుండా ఓ వ్యక్తిని నిర్బంధంలోకి తీసుకోవడం అసహ్యకరమైన చర్య. అన్యాయమైన చట్టాలు చేసినా, వాటిని ప్రయోగించినా శాంతియుతంగా ఆందోళన చేపట్టడం కంటే ప్రజలు ఇంకేమి చేయగలరు?’’ అని ఆయన ప్రశ్నించారు. పార్లమెంటు, చట్టసభల్లో చేసిన చట్టాలను గౌరవించాలనీ.. ఆందోళనలు చేయడం అరాచకానికి దారితీస్తుందని ప్రధాని మోదీ పేర్కొనడంపైనా చిదంబరం విరుచుకుపడ్డారు. ‘‘మహాత్మాగాంధీ, మార్టిన్ లూథర్, నెన్సన్ మండేలా తదితరుల స్ఫూర్తివంతమైన గాధలు, చరిత్రను ప్రధాని మర్చిపోయినట్టున్నారు. శాంతియుతమైన ఆందోళన, శాసనోల్లంఘనల ద్వారా అన్యాయమైన చట్టాలను వ్యతిరేకించాలి. సత్యాగ్రహం చేపట్టాలి..’’ అని పిలుపునిచ్చారు.


పీఎస్ఏ 1978 నాటి జమ్మూ కశ్మీర్ చట్టం. ఎలాంటి విచారణ లేకుండానే రెండేళ్లపాటు ఓ వ్యక్తిని అధికారులు నిర్బంధంలోకి తీసుకునేందుకు వీలుకల్పించే ఈ చట్టాన్ని అత్యంత క్రూరమైందిగా చెబుతారు. కశ్మీర్‌ విభజన, ఆర్టికల్‌ 370 రద్దుకు సంబంధించి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన నాటి నుంచి ఒమర్ అబ్దుల్లా, ముఫ్తీలను ‘ముందు జాగ్రత్త చర్యగా నిర్బంధంలో ’ (ప్రివెంటివ్‌ కస్టడీ) పెట్టారు. ఈ కస్టడీ గడువు ఆరునెలలు. అది మరి కొద్ది గంటల్లో ముగుస్తుందనగా పీఎస్‌ఏను ప్రయోగించి- వారిని మరో ఆరు నెలలపాటు గృహ నిర్బంధం చేశారు.

No comments:

Post a Comment