Wednesday, February 19, 2020

సీఏఏపై ముస్లింలకు మాత్రమే భయమెందుకు?

సీఏఏపై ముస్లింలకు మాత్రమే భయమెందుకు?
సమానత్వం పాక్‌, అఫ్గాన్‌లలో ఉందా?.. ఈ దేశం ధర్మశాల కాదు: స్వామి
రాయదుర్గం, హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): ఎవరు పడితే వారు యథేచ్ఛగా వచ్చి నివసించేందుకు భారత్‌ ఏమీ ధర్మశాల కాదని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి  వ్యాఖ్యానించారు. ఆర్థిక ప్రయోజనాల కోసం భారత్‌లోకి ప్రవేశించే ప్రజలను ఐరాస నిభందనల ప్రకారం శరణార్థులుగా పరిగణించరని ఆయన హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో చెప్పారు. ‘సీఏఏ అనేది ఇపుడు ప్రత్యేకంగా ప్రవేశపెట్టలేదు. ఇందిరాగాంధీ,రాజీవ్‌గాంధీ ప్రధాని అయినపుడు చేసినదే ఇది.. ఆనాడు వారు పూర్తిగా దాన్ని నెరవేర్చలేదు. మేం నెరవేర్చాం.. అంతే’’ అని స్వామి తెలిపారు.‘‘ సీఏఏ, ఎన్నార్సీలపై దేశంలో ఉన్న సిక్కులు, బౌద్ధులు, పర్షియన్లు ఇతరులెవరికీ లేని భయాలు  కేవలం ముస్లింలకు మాత్రమే ఎందుకు? సీఏఏను వ్యతిరేకించే వారు అందులోని ఏ అంశాన్ని వ్యతిరేకిస్తున్నారో స్పష్టంగా చెప్పటం లేదు.’’ అని స్వామి పేర్కొన్నారు. ‘‘ఆర్టికల్‌ 14 సమానత్వాన్ని గురించి చెబుతుంది. ఈ సమానత్వం పాకిస్తాన్‌, బంగ్లాదేఽశ్‌, ఆఫ్గనిస్తాన్‌లలో ఉందా? అక్కడ మైనారిటీలను దేశప్రజలతో సమానంగా చూడరు.  రోహింగ్యాలు 1944లో జిన్నా నాయకత్వంలో పాకిస్తాన్‌ను తమ దేశంగా పేర్కొంటూ సంతకాలు చేశారు. వారికి పౌరసత్వం కల్పించాల్సిన బాధ్యత భారత్‌కు లేదు’’ అని ఆయన వివరించారు. ఆయన ప్రసంగం కొనసాగుతున్నంత సేపూ కొందరు విద్యార్థులు సీఏఏకు వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శించి నిరసన తెలుపుతూనే ఉన్నారు.



జీఎస్టీ ఎవరికీ అర్థంకాని అంశం...



సెంట్రల్‌ వర్సిటీలో మోదీ సర్కారు నిర్ణయాలను ప్రస్తుతించిన స్వామి అంతకుముందు ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో దేశ ఆర్థిక వ్యవస్థపై ఏర్పాటు చేసిన ప్రసంగంలో మాత్రం తీవ్ర విమర్శలు చేశారు. వస్తు సేవల పన్ను వ్యవస్థ (జీఎస్టీ) తేవడం 21వ శతాబ్దిలో అతి పెద్ద వెర్రి నిర్ణయమని ఆయన ఘాటుగా దుమ్మెత్తారు.  ‘‘ఇది ఓ సంక్లిష్టమైనది. చిదంబర రహస్యం. ఎవరికీ అర్థం కాని అంశం. ఏ ఫారం నింపాలో అర్థం కాదు. అన్నీ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలంటారు. విద్యుత్‌ సౌకర్యమే లేనిచోట ఈ డేటా ఎక్కించడం ఎలా సాధ్యం?’’ అని ప్రశ్నించారు.  ఆర్థిక రంగం అభివృద్ధికి ఇన్‌కంటాక్స్‌ను రద్దు చేయాలని సుబ్రమణ్యస్వామి డిమాండ్‌ చేశారు. 

No comments:

Post a Comment