Saturday, February 29, 2020

Dhanikonda Hanumantha Rao - Literature క్షమించండి, హాజరు కాలేను ! ~~

Dhanikonda  Hanumantha Rao  - Literature క్షమించండి, హాజరు కాలేను !
~~

కె. శ్రీనివాస్ గారూ, మీ ఆహ్వానం అందింది. హాజరుకాలేక పోతున్నందుకు క్షమించండి. నేనింకా మీరు పిలుపునిచ్చిన " ఛీ కట్టుకోవాలి మనల్ని మనం " తాలూకూ ఉత్తేజం, ఉద్వేగం నుంచి ఇంకా బయటకు రాలేదు. ఏదొక కార్యాచరణ గురించే ఇంకా ఆలోచిస్తున్నాను. మీరు మాత్రం ఛీ కొట్టుకోవడం నుంచి బయటకు పూర్తిగా వచ్చి ఈ సకుటుంబ సపరివారపు కార్యక్రమంలోకి వచ్చినందుకు అభినందనలు. మరోసారి మీరేమిటో, మీ అసలు మొఖం ఏమిటో మీరే తెలుగు సమాజానికి బాగా అర్థం చేయించి భ్రమలు తొలిగించినందుకు కృతజ్ఞతలు.


దేశ రాజధానిలో పారిన విద్వేషపు రక్తపు తడి యింకా ఆరనే లేదు తెలుగు నేల శతజయంతి వుత్సవాలు విందుల్లో చురుగ్గా పాలుపంచుకునే కార్యక్రమంతో రావటంలో వింతేమీ లేదు. ముందుగా అనుకున్న కార్యక్రమం అని సరిపెట్టుకుందాం అనుకున్నా హృదయం ఒప్పుకోవడం లేదు మన అమానవీయమైన పనులు చూసి.మన యింటిలో బంధువులకో మరెవ్వరికో ఆరోగ్యం బావులేనప్పుడు వుత్సవాలు చేసుకుంటామా,పోస్ట్ పోన్ చేసుకోమా? నిన్న ఓ విరసం మిత్రుడు ఇంత నెత్తుటి చిత్తడి ముంగిట పుస్తక ఆవిష్కరణ సంబరాలేమిటీ ? అని వాపోయారు. వాస్తవమే కదా అనిపించింది. రోజూ గుట్టలుగా వచ్చిపడుతున్న వార్తల్లోనుంచి తెగిపోయిన అవయవాల్ని, అవి చెప్పే హృదయవిదారక దృశ్యాలు మనల్ని అన్నం తిననిస్తున్నాయా, నిద్రపోనిస్తున్నాయా?

ఇప్పటికే అనేక సభలు ఈ శతజయంతి సందర్భంగా నిర్వహించారు. మీ ఇంటి రచయిత కాబట్టీ మీడియాలో కూడా విరివిగానే కవరేజ్ వచ్చింది. కొన్నాళ్ళు ఆగి జరుపుకుంటే ఎంతో మర్యాదగా ఉండదా? దేశరాజధానిలో ఇంత విషాదం నెలకొని ఉన్న సమయంలో నూరేళ్లు నిండిన రచయిత రచనలు మీద ఇప్పుడు డే లాంగ్ సెషన్ ఏమిటండీ ?

ఈ కార్యక్రమం జరిగే రోజే CAA, ఉపా కేసులకు వ్యతిరేకంగా సభకి నిర్వహిస్తోన్న విరసంకి ఇప్పటికైనా ఒక విషయం అర్ధం అవ్వాలి. ప్రజాస్వామిక రచయితల వేదిక తమకి సరియైన ఫ్రoటల్ ఆర్గనైజేషన్ కాదని. విరసాన్ని తమ కెరీర్ కోసం ఉపయోగించుకుంటున్న సంస్థ అని. లేదు ఉదారవాదాన్నే మా ఏకైక నినాదం చేసుకున్నాం అనుకుంటే ఇక మీ ఇష్టం. అత్యవసరంగా మాటాడాల్సిన చర్చించాల్సిన విషయాలు ఉన్న ఈ సమయంలో 'కొత్త చూపుతో మరింత కాంతివంతం అవుదాం' అని పోస్టింగ్స్ పెట్టుకోవడం చూస్తుంటే గోడలకు ఆవల స్త్రీపురుష సంబంధాలను చర్చించటానికి ఇదే సరైన సమయం అనుకుంటున్నారేమో బహుశా ?

ఈ కార్యక్రమ నిర్వాహకుల మీద, పాల్గొంటున్న రచయితల మీద నాకైతే పెద్దగా భ్రమలు లేవు కానీ ఏ సంస్థ లో వున్నా, ఎక్కడున్నా కనీస ప్రజాస్వామిక విలువల కోసం గొంతెత్తే కాత్యాయనీ విద్మహే గారు, సంగిశెట్టి శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమంలో వక్తలుగా కనిపించడం ఎందుకో బాగోలేదు. ఇప్పుడున్న ఈ వాతావరణంలో మనం మాటాడాల్సిన విషయాలు యేమిటి ? తెలుగు సమాజం ఇప్పుడు మీ నుండి ధనికొండ గురించి అభిప్రాయాలను కోరుకోవడం లేదు. ధనికొండ ఏ కోవకు చెందిన రచయితో, ఏ భావజాలం కోసం రచనలు చేశారో, వాటిలో ప్రధాన వస్తువు ఏమిటో తెలుగు సాహిత్యంలో ఆయన పాత్ర ఏమిటో అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా తెలుసుకునేందుకు ఏమీలేదు. అది మీకూ తెలుసు. ఇప్పుడు దేశంలోని ప్రతీ ఇంటి తలుపునీ తడుతోన్న నెత్తుటి మడుగు కోసం ఆ వేదిక మీద నుంచి మీరేమి మాట్లాడగలరు?

ఈ సకుటుంబ సపరివార "కమ్మ"ని బ్రాహ్మణ విందు భోజనానికి హాజరయ్యే భోక్తల్లో చాలామంది ఇప్పటికే తమ వాల్స్ మీద రాజధాని నరమేధం మీద బోల్డన్ని కన్నీళ్లని ఒలకబోసేసారు. మరి ఈ విందులో పాల్గొని ఏమి మాట్లాడనున్నారో వారివారి విజ్ఞతకే వదిలేద్దాం. నేనైతే ఈ విషాద సమయంలో మీ కుటుంబ వేడుక లో పాలుపంచుకోలేను. పస్తుండయినా సరే ఈ చిన్న నిరసన కార్యక్రమంలోనే పాల్గొంటాను.

పి.ఎస్. :-

శ్రీనివాస్ గారూ, దయచేసి ఇక మీదట ' ఛీ కొట్టుకుందాం ', 'సిగ్గుపడదాం ' లాంటి విప్లవ పిలుపులు ఇవ్వకండి. నాలాంటి నరాల బలహీనత ఉన్న అర్భకుల ప్రాణాల మీద కొస్తుంది.

No comments:

Post a Comment