Wednesday, February 26, 2020

ఢిల్లీ అల్లర్లలో యూపీ కంట్రీమేడ్ తుపాకుల వినియోగం

ఢిల్లీ అల్లర్లలో యూపీ కంట్రీమేడ్ తుపాకుల వినియోగం

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అల్లర్లలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కంట్రీమేడ్ తుపాకులు, కత్తులు వినియోగించారని వెల్లడవడం సంచలనం రేపింది. ఈ నెల 24, 25 తేదీల్లో ఢిల్లీలో జరిగిన అల్లర్లలో దుండగులు కంట్రీమేడ్ తుపాకులు, కత్తులు, సుత్తులు, కొడవళ్లు, బేస్‌బాల్ బ్యాట్లు, పెద్ద కర్రలు, పెద్ద రాళ్లు వినియోగించారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ప్రత్యక్ష సాక్షులు, క్షతగాత్రులు చెప్పిన సమాచారంతో దుండగులు యూపీ రాష్ట్రానికి చెందిన కంట్రీమేడ్ తుపాకులతో కాల్పులు జరిపారని తేలింది.పలువురు క్షతగాత్రుల శరీరాల్లో నుంచి తూటాలు, పదునైన బ్లేడ్లు, రాళ్లు, డ్రిల్ బిట్లు వెలికి తీశామని గురుతేజ్ బహదూర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ జగ్ పర్వేష్ చంద్ర చెప్పారు. ఈ అల్లర్లలో మరణించిన 27 మందిలో 14 మంది తుపాకీ గాయాలతోనే మరణించారని వైద్యులు ధ్రువీకరించడం సంచలనం రేపింది.



యూపీ నుంచి దేశీయ పిస్టళ్ల రవాణ

ఢిల్లీ ఘర్షణల్లో ఉపయోగించిన దేశీయ పిస్టళ్లను ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీకి తీసుకువచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఢిల్లీలో తుపాకుల తయారీ కర్మాగారాలు లేవని, ఇక్కడ ఉపయోగించే ప్రతీ అక్రమ తుపాకీ బయట ప్రాంతాల నుంచి అక్రమంగా రవాణ అవుతుందని జఫ్రాబాద్ ప్రాంతానికి చెందిన ఓ పోలీసు అధికారి చెప్పారు. ఢిల్లీలో నేరగాళ్లకు కంట్రీమేడ్ తుపాకులు ఒక్కోక్కటి రూ.3వేల నుంచి రూ.5వేలకే లభిస్తున్నాయని తేలింది. ఆటోమేటిక్ పిస్టళ్లు అయితే ఒక్కో రూ.20వేలకే లభించడం విశేషం.



రాళ్ల దాడితోనే హెడ్ కానిస్టేబుల్ మృతి

పోలీసు అధికారికి పిస్టల్ చూపించిన షారుఖ్ ను పోలీసులు గుర్తించారు. ఆయుధాలే కాకుండా రాళ్లతో కొట్టడం వల్లనే పోలీసు హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ మరణించాడని, డీసీపీ అమిత్ శర్మ గాయపడ్డాడని వైద్యులు చెప్పారు. బయటినుంచి వచ్చిన ఆగంతకులు ట్రక్కుల్లో రాళ్లు తెచ్చి వాటితో దాడి చేశారని, పథకం ప్రకారమే తమపై దాడి జరిగిందని ఢిల్లీ బాధితులు చెప్పారు.



డివైడర్లు పగులగొట్టి రాళ్లతో దాడి

హింసాకాండ సాగిన జాఫ్రాబాద్ రోడ్డుపై ఉన్న కాంక్రీట్ డివైడర్ కంచెలను పగులగొట్టి వాటి రాడ్లు, రాళ్లను ఆయుధాలుగా చేసుకున్నారని తేలింది. ఈ దాడుల్లో కత్తులు, పెట్రోల్ బాంబులు, స్ర్కాప్ డీలర్ల వద్ద ఉన్న ఖాళీ సీసాలు, బీరు బాటిళ్లతో దాడులు చేశారని వెల్లడైంది. ఈ ప్రాంతాల్లోని యువకులు నిరుద్యోగంతో చిన్న చిన్న నేరాలకు పాల్పడుతుంటారని, వారి ఇళ్లలో రాళ్లు, ఇటుకలు, ఖాళీ గాజు సీసాలను డాబాలపై నిల్వ చేశారని ఢిల్లీ మాజీ పోలీసు అధికారి ఎల్ఎన్ రావు చెప్పారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లపై 18 కేసులు నమోదు చేసి 106 మందిని అరెస్టు చేశారని, ఇందులో ఏఏ రకాల ఆయుధాలు వాడారనేది సమగ్ర దర్యాప్తు సాగిస్తున్నామని ఢిల్లీ  పోలీసులు చెప్పారు.

No comments:

Post a Comment