Wednesday, February 26, 2020

ఢిల్లీ అల్లర్లపై వాదనలు విన్న కొద్ది గంటలకే.. జస్టిస్ ఆకస్మిక బదిలీ వేటు

ఢిల్లీ అల్లర్లపై వాదనలు విన్న కొద్ది గంటలకే.. జస్టిస్ ఆకస్మిక బదిలీ వేటు

మరో 1984 కానివ్వం

అర్ధరాత్రి రంగంలోకి దిగిన ఢిల్లీ హైకోర్టు

క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలించాలని ఆదేశం

డాక్టర్లతో స్వయంగా మాట్లాడిన ధర్మాసనం

రాజ్యాంగ సంస్థల అధిపతులు చొరవ చూపాలి

ఎఫ్‌ఐఆర్‌ల నమోదుకు ఎన్ని రోజులు కావాలి?

ఇదా ఢిల్లీ పోలీస్‌ తీరు?.. కడిగిపారేసిన బెంచ్‌

బెంచ్‌లోని న్యాయమూర్తి ఆకస్మిక బదిలీ



న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: దేశ రాజధానిలో ఇందిరాగాంధీ హత్యానంతరం చెలరేగిన అల్లర్ల నాటి పరిస్థితిని పునరావృతం కానివ్వబోమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ‘‘ఢిల్లీని మరో 1984 కానివ్వం..  ఈ కోర్టు కావలిలో, ఈ పోలీసుల నిఘాలో ఉన్నంతకాలం ఆనాటి పరిస్థితులు రానివ్వం. అందరం పూర్తి అప్రమత్తంగా ఉండాలి’’ అని పేర్కొంది. ఢిల్లీ అల్లర్లపై హర్ష్‌ మందర్‌ అనే సామాజికవేత్త దాఖలు చేసిన ఓ పిటిషన్‌పై మంగళవారం అర్ధరాత్రి దాటాక, మళ్లీ బుధవారంనాడు రెండు దఫాలు హైకోర్టు అత్యవసరంగా స్పందించి- నిర్దిష్టమైన ఆదేశాలిచ్చింది.



ఢిల్లీ పోలీసుల నిష్ర్కియాపరత్వాన్ని కడిగిపారేసింది. ‘అల్లర్లలో గాయపడ్డవారిని చిన్నచిన్న ఆసుపత్రుల నుంచి జీటీబీ, ఎల్‌ఎన్‌జేపీ లాంటి పెద్దాసుపత్రులకు పంపే పరిస్థితులు లేవని, సురక్షితంగా బాధితులను చేర్చేందుకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తొలుత సరూర్‌ మందర్‌ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టును అర్థించారు. అపుడు సమయం రాత్రి ఒంటిగంట కావొస్తోంది. వెంటనే జస్టిస్‌ ఎస్‌.మురళీధర్‌, జస్టిస్‌ అనూప్‌ బంభానీలతో కూడిన బెంచ్‌ ఏర్పాటైంది. పోలీసు ఉన్నతాధికారులను ఉన్నపళంగా జస్టిస్‌ మురళీధర్‌ నివాసానికి రావలిసిందిగా కబురుపెట్టింది. వారు రాగానే- బాధితులను తక్షణం ఆసుపత్రులకు, ఇతర సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది. అత్యవసర చికిత్సకు ఏర్పాట్లు చేయాలని సూచించింది. న్యూ ముస్తాఫాబాద్‌లో ఉన్న అల్‌-హింద్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అన్వర్‌కు జడ్జీలు ఫోన్‌ చేశారు. ఆస్పత్రిలో రెండు మృతదేహాలున్నాయని, 22 మంది తీవ్రగాయాలతో పడి ఉన్నారని, వారిని ఇతర ఆస్పత్రులకు తరలించేందుకు సాయంత్రం 4గంటల నుంచీ తాము పోలీసు సాయం కోసం ఎదురుచూస్తున్నామని ఆయన జస్టిస్‌ మురళీధర్‌కు చెప్పారు. ఈ విషయాన్ని కోర్టు వెంటనే పోలీసులకు చెప్పడంతో వారు రంగంలోకి దిగి ఆ ఆస్పత్రి నుంచి అందరినీ తరలించడం మొదలెట్టారు.   



‘కేసు అత్యవసరంగా వినక్కర్లేదా?’

 రెండు క్లిప్పింగుల సంగతి తమకు తెలుసని, కపిల్‌ మిశ్రా వీడియో చూడలేదని కోర్టు హాల్లో ఉన్న ఓ పోలీసు అధికారి చెప్పారు. దీనిపై బెంచ్‌ పోలీసులకు చీవాట్లు పెట్టింది. ‘మీ ఆఫీసులో చాలా టీవీలున్నాయిగా.. అన్ని చానెళ్లూ కపిల్‌ మిశ్రా ప్రసంగాన్ని టెలికాస్ట్‌ చేశాయి. అది కూడా ఓ పోలీసు ఉన్నతాధికారి సమక్షంలో చేసిన ప్రసంగం. ఢిల్లీ పోలీసు వ్యవస్థలో పరిస్థితులు ఇలా ఉన్నాయన్న మాట దిగ్ర్భాంతి కలిగిస్తోంది’’ అని జస్టిస్‌ మురళీధర్‌ తీవ్రంగా మందలించారు. కపిల్‌ మిశ్రా ప్రసంగ పాఠాన్ని కూడా బెంచ్‌ సొలిసిటర్‌ జనరల్‌కు అందజేసి ‘ఇకనైనా మీ పోలీస్‌ కమిషనర్‌కు సలహా ఇవ్వండి. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని చెప్పండి’ అని వ్యాఖ్యానించింది.



కపిల్‌ మిశ్రా, అనురాగ్‌ ఠాకూర్‌, పర్వేశ్‌ వర్మలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ఆలస్యమెందుకని కోర్టు నిలదీసినపుడు ‘ఇపుడు వారిపై కేసులు పెడితే పరిస్థితి మరింత విషమిస్తుంది. అన్నీ ఆలోచించి ఓ నిర్ణయానికి రావాలి’ అని ఢిల్లీ ప్రభుత్వ తరఫు న్యాయవాది రాహుల్‌ మెహ్రా చెప్పారు. బుధవారం ఉదయం కోర్టు మళ్లీ సమావేశం కాగానే హర్ష్‌ మందర్‌ కేసు విచారణకు వచ్చింది. కపిల్‌ మిశ్రా సహా బీజేపీ నేతలు చేసిన ద్వేషపూరిత ప్రసంగాల గురించి కోర్టు ప్రశ్నించింది. తెలియదని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చెప్పగా జస్టిస్‌ మురళీధర్‌, జస్టిస్‌ తల్వంత్‌ సింగ్‌ బెంచ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘దేశం మొత్తానికి తెలిసిన ఆ వీడియోల వ్యవహారం పోలీసులకు తెలియదా? మేమే ప్రదర్శిస్తాం చూడండి’’ అని 4 వీడియో క్లిప్పింగులను కోర్టు హాలులో చూపారు.



లాయర్ల కీచులాట

విచారణ ప్రారంభానికి ముందు ఢిల్లీ ప్రభుత్వ లాయర్‌తో సొలిసిటర్‌ జనరల్‌ కోర్టు హాల్లోనే గొడవ పడ్డారు. కేసులో పోలీసుల తరఫున తనను వాదించాల్సిందిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ కోరారని తుషార్‌ మెహతా చెప్పగా, తనను ప్రాతినిధ్యం వహించమని ఢిల్లీ ప్రభుత్వం కోరిందని ప్రభుత్వ తరఫు న్యాయవాది రాహుల్‌ మెహ్రా వాదించారు. కాసేపయ్యాక ఇద్దరూ తమ తమ వాదనలు సమర్పించడానికి కోర్టు అనుమతించింది.

జస్టిస్‌ మురళీధర్‌ ఆకస్మిక బదిలీ
బీజేపీ నేతలపై నిశిత విమర్శలు చేసిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ మురళీధర్‌పై బదిలీ వేటు పడింది. ఆయనను పంజాబ్‌ హరి యాణా హైకోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయనను బదిలీ చేయాలని 2018 డిసెంబరు, 2019 జనవరిల్లో కేంద్రం చేసిన సిఫారసును అప్పటి సీజే జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ తిరస్కరించారు. ఢిల్లీ అల్లర్ల కేసు విచారణ సాగు తున్న దశలో బదిలీ చేయడం వివాదాస్పదంగా మారింది. వాదనలు జరిగిన కొద్ది గంటలకే బదిలీ ఉత్తర్వులు వెలువడడాన్ని న్యాయవాదులు ప్రశ్నించారు. ఇది న్యాయ వ్యవస్థకే తీరనిలోటని ఢిల్లీ బార్‌ అసోసియేషన్‌ ఖండించింది.

No comments:

Post a Comment