Monday, February 24, 2020

నమస్తే ఇండియా, నమస్తే మోదీ!

నమస్తే ఇండియా, నమస్తే మోదీ!
ప్రధానిని ప్రశంసల్లో ముంచెత్తిన అమెరికా అధ్యక్షుడు
మా హృదయంలో భారతదేశానికి ప్రత్యేక స్థానం


అగ్రరాజ్యాధిపతి విచ్చేశారు! సతీమణి మెలానియాతోడుగా... ప్రియ పుత్రిక ఇవాంకా, అల్లుడు కుష్నర్‌తో కలిసి... కుటుంబ సమేతంగా ట్రంప్‌ భారత్‌లో అడుగు పెట్టారు. శంఖారావం మధ్య ఎర్ర తివాచీపై నడిచి వచ్చారు. విమానాశ్రయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుజరాతీ జానపద వాయిద్యాలు, నృత్యాల స్వాగతంతో పులకించారు. దారి పొడవునా ఏర్పాటు చేసిన కళా ప్రదర్శనలను తిలకిస్తూ... ప్రజల అభివాదాలు అందుకుంటూ ‘రోడ్‌ షో’లో ముందుకు సాగారు. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. చరఖా తిప్పారు. మహాత్ముడికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి... ప్రపంచంలోనే అతిపెద్దదైన మోతేరా క్రికెట్‌ స్టేడియంను అహ్మదాబాద్‌లో ప్రారంభించారు. అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ‘నమస్తే ట్రంప్‌’... ఇదీ కార్యక్రమం పేరు! కానీ... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రసంగంతో ఇది ‘నమస్తే మోదీ’లా అనిపించింది. ‘మోదీ నా ఆత్మీయ మిత్రుడు’ అని ట్రంప్‌ పదేపదే పలవరించారు. ‘మోదీ సాధించిన విజయాలు’... అంటూ గణాంకాలతో సహా వివరించారు. ప్రధానిని అంతగా పొగుడుతూనే... వాణిజ్య చర్చలకు వచ్చేసరికి, ఆయన మహా మొండిఘటం అని నవ్వుతూ అన్నారు. ట్రంప్‌ గత అధ్యక్షులకు భిన్నంగా ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లోనే తొలిగా అడుగు పెట్టారు. గుజరాత్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు. అహ్మదాబాద్‌లో కార్యక్రమం ముగిసిన అనంతరం... ఆగ్రాలో ప్రేమ చిహ్నం తాజ్‌ మహల్‌ను ట్రంప్‌ దంపతులు సందర్శించారు. అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం అసలైన ఘట్టం! రక్షణ, వాణిజ్య, ఇతర రంగాలపై ఒప్పందాలు!



అహ్మదాబాద్‌, ఫిబ్రవరి 24: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విచ్చేశారు. ‘నమస్తే! నమస్తే! హలో ఇండియా’ అంటూ భారతీయులను పలకరించారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌ను ప్రత్యేకంగా గుర్తించారు. మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. భారత పర్యటనలో భాగంగా సోమవారం ట్రంప్‌-మోదీ కలిసి అహ్మదాబాద్‌లో.. ప్రపంచంలోనే అతి పెద్దదైన మొతేరా క్రికెట్‌ స్టేడియాన్ని ప్రారంభించారు. లక్షమందికిపైగా ప్రజల సమక్షంలో.. వారి జయజయ ధ్వానాల మధ్య ప్రసంగించారు. ‘‘నాకు ఇంత గౌరవాన్ని ఇచ్చిన గొప్ప నాయకుడు, దేశం కోసం పగలూ, రాత్రీ శ్రమించే ది గ్రేట్‌ ఛాంపియన్‌ ఆఫ్‌ ఇండియా, నాకు అద్భుతమైన, నిజమైన మిత్రుడు ప్రధానమంత్రి మోదీకి ధన్యవాదాలు’’ అని తెలిపారు. ఇరు దేశాలది సహజ మైత్రిగా అభివర్ణించారు. ‘‘భూగోళానికి అటువైపు నుంచి 8 వేల కిలోమీటర్లు ప్రయాణించి.. ఒక సందేశం వినిపించేందుకు నా సతీమణితో కలిసి ఇక్కడికి వచ్చాను. భారత్‌ను అమెరికా ప్రేమిస్తుంది. గౌరవిస్తుంది. భారతీయులకు నిజమైన, విశ్వసనీయ మిత్రదేశంగా ఉంటుంది’ అని ప్రకటించారు. ఇది అద్భుత స్వాగతమని, ఎప్పటికీ మరిచిపోలేనిదని చెప్పారు. ‘నా ప్రత్యేక మిత్రుడు ప్రధాని మోదీకి ధన్యవాదాలు. ఆయన ఈ గడ్డ బిడ్డడు. ఈ నగరానికి చెందిన చాయ్‌వాలా కుమారుడు. నాన్న కు సహాయం చేశారు. యువకుడిగా ఉండగా ఈ నగరంలోనే కెఫెటేరియాలో పనిచేశారు. కష్టపడితే ఏ స్థాయికైనా చేరవచ్చుననేందు కు మోదీ నిదర్శనం. ఆయన... గ్రేట్‌ మ్యాన్‌. ప్రతి ఒక్కరూ ఆయనను ప్రేమిస్తారు’ అని మోదీని ప్రశంసల్లో ముంచెత్తారు. అదే సమయంలో.. (వాణిజ్య చర్చల్లో) మోదీ మహా మొండివాడు అని నవ్వుతూనే తన మనసులో మాట బయటపెట్టేశారు. 300 కోట్ల డాలర్ల విలువైన రక్షణ ఒప్పందంపై మంగళవారం సంతకాలు చేస్తున్నట్లు అధికారికంగా తెలిపారు. ‘ఒక అద్భుతమైన వాణిజ్య ఒప్పందం’ కుదుర్చుకునే దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పారు. భారత్‌కు అమెరికా ‘ప్రధాన రక్షణ భాగస్వామిగా’ ఉంటుందని తెలిపారు. అత్యుత్తమ, అరివీర భయంకరమైన ఆయుధ ఉపకరణాలు భారత్‌కు అందించాలని భావిస్తున్నామన్నారు.



పాక్‌తో కలిసి పనిచేస్తున్నది ఇందుకే!

భారత్‌, అమెరికా రెండూ ఉగ్రవాదుల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నాయని ట్రంప్‌ చెప్పారు.  సిరియా, ఇరాక్‌లలో ఐసి్‌సను అంతమొందించడానికి పూర్తి శక్తిని ప్రయోగిస్తున్నామని చెప్పారు. ఐఎస్‌ స్థావరాన్ని నిర్మూలించామని... అల్‌ బగ్దాదీని హతం చేశామని తెలిపారు. ‘‘ఇస్లామిక్‌ ఉగ్రవాదుల నుంచి, వారి సిద్ధాంతాల నుంచి ప్రజలను కాపాడుకునేందుకు భారత్‌, అమెరికా కట్టుబడి ఉన్నాయి. ఇందులో భాగంగానే ఉగ్రవాద బృందాలను అణచివేసేందుకు పాకిస్థాన్‌తో అమెరికా కలిసి పని చేస్తోంది’’ అని ట్రంప్‌ చెప్పారు.



మీ భారత్‌... మహాన్‌!

భారత్‌ వ్యక్తి స్వేచ్ఛను గౌరవించే దేశమని.. భిన్న విశ్వాసాల వారు పక్కపక్కనే ప్రార్థనలు చేసుకునే సామరస్యానికి నిలయమని ట్రంప్‌ ప్రశంసించారు.  ‘‘మోదీ విశిష్ట నాయకుడు. భారత గణతంత్రాన్ని ఘనంగా మార్చేందుకు శ్రమిస్తున్నారు. ఈ ఏడు దశాబ్దాల్లో భారత్‌ ఎంతో సాధించింది. మరీ ముఖ్యంగా.. గత పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ ఆరు రెట్లు పెరిగింది. ప్రపంచ మానవాళికి కొత్త ఆశలు రేకెత్తిస్తోంది’’ అని తెలిపారు. దశాబ్దంలోనే భారత్‌ 27 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకి తీసుకొచ్చిందని.. త్వరలోనే పేదరికం పూర్తిగా మాసిపోయి ప్రపంచంలో అతిపెద్ద ‘మధ్యతరగతి వర్గం’ ఉన్న దేశంగా మారుతుందని చెప్పారు. మోదీ నేతృత్వంలో సంపూర్ణ గృహ విద్యుదీకరణ జరిగిందని చెప్పారు. 32 కోట్ల మందికి ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉందన్నారు. హైవేల నిర్మాణం రెట్టింపైందని.. 7 కోట్లకు మించి వంటగ్యాస్‌ అందించారని వివరించారు.



పవిత్రం... వైవిధ్యం!

పవిత్ర గంగ, స్వర్ణ దేవాలయం, జామా మసీదు... మంచు దుప్పటి కప్పుకొన్న హిమాలయాలు, అందమైన గోవా తీరం! ఇంతటి వైవిధ్యం ఈ భూమ్మీద ఇంకెక్కడుంది? వేదాల్లోని విజ్ఞానం, పురాణాల్లోని విలువలు.. ఆధునిక భారతానికి బాటలు పరిచాయి. భారత్‌ బలం పాఠ్యపుస్తకాల్లో లేదు! మీ హృదయాల్లోనే ఉంది. ఉత్తరాది, దక్షిణాది - హిందూ, ముస్లిం, క్రైస్తవులు, యూదులు... ధనికులు, పేదలు... సమస్త భారతీయులు తమ ఘన చరిత్ర నుంచి స్ఫూర్తిపొంది... బలమైన భవిష్యత్తు దిశగా అడుగులు వేయాలి.

- డొనాల్డ్‌ ట్రంప్‌



ఐదు నెలల కిందట మీ ప్రధానికి అమెరికాలో ఒక భారీ ఫుట్‌బాల్‌ స్టేడియంలో స్వాగతం పలికాం. ఇప్పుడు... నాకు ప్రపంచంలోనే అతిపెద్దదైన క్రికెట్‌ స్టేడియంలో భారత్‌ నన్ను  అపూర్వంగా స్వాగతించింది. ఈ అద్భుతమైన ఆతిథ్యాన్ని మేం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం. నేటి నుంచి భారత్‌కు మా హృదయాల్లో మరింత ప్రత్యేక స్థానం ఉంటుంది.

- డొనాల్డ్‌ ట్రంప్‌




భారత దేశానిది అద్భుతమైన విజయగాథ! మహత్తరమైన ప్రగతి. ప్రపంచంలోని ఇతర దేశాలకు భారత్‌ ఆదర్శం. నిర్బంధాన్ని విధించి అభివృద్ధి చెందడానికి, ప్రజలకు స్వేచ్ఛనిచ్చి పురోగమించడానికి మధ్య చాలా తేడా ఉంది. భారత్‌ తన ప్రజలకు స్వేచ్ఛనిచ్చి మరీ ప్రబల ఆర్థిక శక్తిగా ఆవిర్భవించింది. భారత్‌ ముందుకు వెళుతోంది. భవిష్యత్తులో ఇంకెంత ముందుకెళుతుందో పోల్చి చూపేందుకు మరో ఉదాహరణ కూడా ఉండదు! ఇందుకు... ఇతరులు ఊహించని స్థాయిలో ప్రధాని మోదీ పునాదులు వేశారు.

- డొనాల్డ్‌ ట్రంప్‌




స్వేచ్ఛ.. సంకల్పం

భారత్‌ భిన్న మతాల, భాషల సమాహారం. భారతావని మొత్తం భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తుంది. స్వేచ్ఛకు ప్రతిరూపం స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ.. అఖండతకు, సంకల్పానికి నిదర్శనం స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ (సర్దార్‌ పటేల్‌ విగ్రహం). అమెరికా స్వేచ్ఛా సమాజమైతే.. భారత్‌ ప్రపంచం మొత్తాన్ని తన కుటుం బం అనుకుంటుంది (వసుధైక కుటుంబం). అతి ప్రాచీన, అతి పెద్ద ప్రజాస్వామ్యాల కలబోత ఇది.

- నరేంద్ర మోదీ

No comments:

Post a Comment