Monday, February 24, 2020

అల్లర్లతో అట్టుడికిన ఢిల్లీ!
సీఏఏ ఆందోళనల్లో హింస..
పోలీసు, ముగ్గురు పౌరుల మృతి
యుద్ధరంగంగా మారిన ఈశాన్య ఢిల్లీ
ఇళ్లు, షాపులు, వాహనాలకు నిప్పు
ట్రంప్‌ ఢిల్లీలో అడుగుపెట్టిన రోజే భగ్గు
ప్రచారం కోసమే ఇదంతా: సర్కారు
పరిస్థితి అదుపులోనే: హోం శాఖ
భారత్‌ ప్రతిష్ఠను దెబ్బతీసే యత్నం
అల్లర్లపై కఠిన చర్యలు: కిషన్‌రెడ్డి
కేజ్రీ, రాహుల్‌, అసద్‌, ఏచూరి ఖండన


న్యూఢిల్లీ/హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై కొన్ని రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతుండగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సోమవారం ఢిల్లీలో అడుగుపెట్టిన వేళ ఒక్కసారిగా హింస ప్రజ్వరిల్లింది. ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతం యుద్ధరంగాన్ని తలపించింది. అనేక ప్రాంతాలు అల్లర్లతో అట్టుడికాయి. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన హింసాకాండలో ఒక హెడ్‌ కానిస్టేబుల్‌, ముగ్గురు పౌరులు మరణించగా, డీసీపీ సహా 50 మంది గాయపడ్డారు. ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్‌, మౌజ్‌పూర్‌ ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం మొదలైన అల్లర్లు సోమవారం కూడా కొనసాగాయి. ఇళ్లకు, షాపులకు, వాహనాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు. రెండు వర్గాలవారు ఒకరిమీద మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌ పర్యటనలో భాగంగా ఢిల్లీకి చేరుకోగా, మరోవైపు ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలోని కొన్ని బస్తీల్లో యథేచ్ఛగా అల్లర్లు కొనసాగాయి. అల్లరిమూకలను చెదరగొట్టే క్రమంలో తలకు గాయమై హెడ్‌ కానిస్టేబుల్‌ రతన్‌లాల్‌ ప్రాణాలు కోల్పోగా, షాహ్‌దరా డీసీపీ అమిత్‌ శర్మ గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. హింసకు దిగిన అల్లరిమూకలను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించి లాఠీచార్జి చేశారు. అనేక ప్రాంతాల్లో 144వ సెక్షన్‌ను విధించారు.  మౌజ్‌పూర్‌, భజన్‌పురా, చాంద్‌బాగ్‌ ప్రాంతాల్లో అనేక షాపులు, ఇళ్లు, ఒక పెట్రోల్‌ పంప్‌కు నిరసనకారులు నిప్పుపెట్టారు. మంటలను ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక వాహనానికి కూడా నిరసనకారులు నిప్పు పెట్టారు. ఇదిలావుండగా, అదనపు బలగాలను తరలించి, శాంతిభద్రతలను పునరుద్ధరించాల్సిందిగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌కు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు సంయమనం పాటించాలని, హింస ద్వారా సమస్యలు పరిష్కారం కావని ఆయన చెప్పారు. అల్లర్లను అదుపు చేయాల్సిందిగా బైజాల్‌ ఢిల్లీ పొలీసు కమిషనర్‌ను ఆదేశించారు. వైరి వర్గాల మధ్య హింసాకాండకు సంబంధించి పోలీసులు 4 కేసులను నమోదు చేశారు. ఢిల్లీ సీపీ అమూల్య పట్నాయక్‌ శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఢిల్లీ మెట్రోలోని ఐదు స్టేషన్లను మూసివేశారు. పరిస్థితి పూర్తి అదుపులో ఉందని, అవసరమైన ప్రాంతాలకు బలగాలను తరలించామని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా చెప్పారు. అల్లర్లకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి కిషన్‌రెడ్డి సోమవారం హెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతియుతంగా నిరసనలను ఆమోదిస్తామనీ, హింసను సహించేది లేదని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పర్యటన సమయంలో హింసకు పాల్పడి దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేశారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘షాహీన్‌బాగ్‌ వద్ద శాంతియుతంగా నిరసనలు చేస్తున్న వారిని ప్రభుత్వం ఖాళీ చేయించలేదు. ఒకవేళ హింస చెలరేగితే కఠిన చర్యలు తీసుకుంటాము’’ అని హెచ్చరించారు. హింసాకాండను కాం గ్రెస్‌ నేతలు రాహుల్‌, ప్రి యాంకా గాంధీ ఖండించారు. ఈ అల్లర్లకు కేంద్రమే బాధ్యత వహించాలని సీపీ ఎం ప్రధాన కార్యదర్శి సీతా రాం ఏచూరి అన్నారు.  అల్లర్లను రెచ్చగొట్టిన బీజేపీ నేతను తక్షణం అరెస్టు చేయాలని మజ్లిస్‌ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు.



షాహీన్‌బాగ్‌పై లాయర్ల నివేదిక

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు షాహీన్‌బాగ్‌ వద్ద నిరసనకారులతో చర్చలు జరిపిన లాయర్లు సోమవారం సుప్రీంకోర్టుకు సీల్డ్‌ కవర్‌లో తమ నివేదికను సమర్పించారు. ఈ నివేదికను పరిశీలించి షాహీన్‌బాగ్‌కు సంబంధించిన కేసులపై బుధవారం విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది.



అల్లర్లకు బీజేపీ నేత ఆజ్యం?

సీఏఏకు నిరసనగా జాఫ్రాబాద్‌ మెట్రో స్టేషన్‌ వెలుపల ఒక రోడ్డుకు అడ్డంగా మహిళలు శనివారం రాత్రి బైఠాయించారు. దీనిపై ఆదివారం రాత్రి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. దీంతో ఆందోళనకారులు అనేక ప్రాంతాల్లో బైఠాయించడం ప్రారంభించారు. ఈ దశలో బీజేపీ నేత కపిల్‌ మిశ్రా రంగంలోకి దిగి నిరసనకారులను ఖాళీ చేయించాల్సిందిగా కోరడంతో పరిస్థితి అదుపు తప్పింది.



ట్రంప్‌ దృష్టిలో పడేందుకే అల్లర్లు!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఢిల్లీలో అడుగుపెట్టిన రోజే అల్లర్లు జరగడం వెనుక ఒక కుట్ర ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సీఏఏకు వ్యతిరేకంగా షాహీన్‌బాగ్‌ వద్ద చాలా రోజులుగా శాంతియుతంగా నిరసనలు చేస్తున్న ఆందోళనకారులు సోమవారం ఒక్కసారిగా రెచ్చిపోవడం వెనుక సీఏఏ వివాదాన్ని అంతర్జాతీయస్థాయికి తీసుకువెళ్లే వ్యూహం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘ట్రంప్‌ ఢిల్లీకి వచ్చిన రోజునే అల్లర్లను రెచ్చగొట్టడం ద్వారా ఆయన దృష్టిని ఆకర్షించి విస్తృత ప్రచారం పొందాలన్న వ్యూహం కనిపిస్తోంది’’ అని ఆ వర్గాలు తెలిపాయి. 

No comments:

Post a Comment