Tuesday, December 6, 2022

Is Ambedkar a phylosopher ?

 అంబేద్కర్ తాత్వికుడు కాదా.?

ఈ మధ్య మాటల సందర్భంలో ఒక మిత్రుడు చేసిన వ్యాఖ్య నన్ను కాస్త ఇరకాటంలో పెట్టింది. ‘అంబేద్కర్‌లో తాత్వికత లేదు. ఆయన గుర్తించదగిన ఆర్థికవేత్త. కానీ తత్వవేత్త కాదు’. ఇదీ అతని కామెంట్‌. నాకర్థమయిందేంటంటే చాలామంది మాదిరిగా ఈయన కూడా అంబేద్కర్‌ని ఒప్పుకుంటూనే ఆయన తాత్వికతను విస్మరిస్తున్నాడు లేదా పట్టించుకోవడం లేదు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకునే ఈ వ్యాస ప్రయత్నం.

ప్రపంచంలో ఒక మనిషి మీద మరొక మనిషి అధికారానికీ, యాజమాన్యానికీ, పీడనకీ కారణం మూడు విషయాలకు చెందిందని అంబేద్కర్‌ స్పష్టం చేస్తారు: అవి మతం, సాంఘిక హోదా, సంపద. ఈ మూడు అంశాలకూ ఒక మనిషి జీవితాన్నీ, స్వతంత్రతనూ ప్రభావం చేయగల శక్తి ఉన్నదనీ కాకపోతే తత్కాల సామాజిక సందర్భాన్ని బట్టి దేని ప్రభావం మిగతా వాటికంటే ప్రబలంగా ఉంటుందనేది నిర్ధారితమవుతుందనీ విశ్లేషిస్తారు అంబేద్కర్‌."Religion, social status, and property are all sources of power and authority, which one man has, to control the liberty of another. One is predominant at one stage; the other is predominant at another stage. That is the only difference' ఒక నిర్దిష్ట సమాజంలో, ఒక నిర్దిష్ట కాలంలో అధికార వనరు సాంఘిక హోదాకీ, మతానికీ చెందినదయినపుడు ఆ సాంఘిక మతపరమైన సంస్కరణ ద్వారానే మిగిలిన సంస్కరణలు సాధ్యపడతాయని స్పష్టం చేసారు. తను చేసిన ఈ ప్రతిపాదనలకు ప్రపంచ చరిత్రనుంచీ, భారత చరిత్ర నుంచీ సరైన ఆధారాల్ని అంబేద్కర్‌ చూపించారు. యూరోపియన్ల రాజకీయ విముక్తికి లూథర్‌ మత సంస్కరణ దారినిచ్చిందని చెబుతారు. ప్యూరిటనిజమ్‌ అనే మతవాదం అటు ఇంగ్లండులోనూ ఇటు అమెరికాలోనూ తీసుకొచ్చిన రాజకీయస్వేచ్ఛనూ స్వతంత్రతనూ ఈకోణం నుంచే చూస్తారు అంబేద్కర్‌. అయితే ఆధునిక ఐరోపాలో ఆర్థిక సంబంధాలే మానవసంబంధాల్ని నిర్ణయిస్తున్నాయనీ ఆ మేరకు సంపద మనిషి పీడనకూ దోపిడీకీ కారణమవుతుందనీ గుర్తించారు. అందుకే తన కాలం ఐరోపా గురించి మార్క్స్‌ చేసిన విశ్లేషణ కరెక్టని ఒప్పుకుంటారు. అరబ్బుల రాజకీయ ఏకీకరణకూ, అధికారానికీ మహమ్మద్‌ ప్రవక్త తీసుకొచ్చిన మత విప్లవం కారణమవటాన్నీ మరువకూడదంటారు.

భారత చరిత్ర కూడా ఇదే దృక్కోణానికి సాక్ష్యమవుతుందనీ విపులంగా వివేచించి చూపారు. బౌద్ధం తీసుకొచ్చిన మత సాంఘిక విప్లవం మౌర్య సామ్రాజ్య రాజకీయ మార్పులకు నేపథ్యంగా పనిచేసిందని నొక్కి చెబుతారు. అసలు ప్రాచీన భారత దేశ చరిత్రంతా బుద్ధిజానికీ-హిందూయిజానికీ జరిగిన సంఘర్షణలమయమనీ విశ్లేషిస్తూ, బుద్ధిజం బ్రాహ్మణిజం మీద విప్లవంగా ముందుకొస్తే, తరువాత హిందూయిజం బుద్ధిజం మీద ప్రతీఘాతుక తిరుగుబాటుగా వచ్చిందనీ అంబేద్కర్‌ సాధికారికంగా వివరించారు. అలాగే శివాజీ తీసుకొచ్చిన రాజకీయ విప్లవం వెనుక మహారాష్ట్ర సాధువులు నడిపిన సాంఘిక విప్లవం ఉందని వాదిస్తారు. ఇక నిత్యజీవితంలో సాధారణ సాధువులూ, బాబాలూ, స్వాములూ, ఫకీర్లూ జనం మీద వేసే ప్రభావంలో నెరిపే అధికారంలో ఉన్నది సాంఘిక హోదా ద్వారా వారికి లభించిన ఆధిపత్యమేననీ; ఆస్తుల్ని కూడా అమ్ముకొని, అప్పులు జేసి పుణ్య క్షేత్రాలకు వెళ్ళే సంస్కృతి సాంఘికమయినదే కానీ ఆర్థికమయినది కాదనీ గుర్తింపజేస్తారు అంబేద్కర్‌. రాజకీయ నాయకుల మీదా, జడ్జీల మీదా, వ్యాపారుస్తుల మీదా, బ్యూరోక్రాట్ల మీదా బ్రాహ్మణ పురోహితులు కలిగి ఉన్న పట్టులో కానివ్వండీ, ఏ చిన్న ఆందోళనయినా ఇక్కడ వెంటనే మతం మలుపు తీసుకోవడంలో కానివ్వండీ కనిపించేది ఇక్కడి మత-సాంఘిక వ్యవస్థ ఆధిపత్యమేననీ మనకి అర్థం చేయిస్తారు.

కులాలకు అంటగట్టిన విలువలకూ గౌరవాలకూ అనుగుణంగా ఆయా కులస్తులకు ఆదాయన్నీ, ఆర్థిక వసతినీ సమకూర్చే కుల వ్యవస్థ భారతీయ ఆర్థిక వ్యవస్థను రూపొందించి నడుపుతుందని అంబేద్కర్‌ అనితర సాధ్యంగా నిరూపించారు. ఆర్థిక వ్యవస్థను కులవ్యవస్థ నడుపుతున్న కారణంగానే ఇక్కడ శ్రమ విభజనే కాకుండా ఎక్కడా లేని శ్రామికుల విభజన ఏర్పడిందని తాత్వీకరించారు అంబేద్కర్‌. 'The caste sy-stem is not only a division of labour. It is also a division of labourers' అనే అంబేద్కర్‌ సూత్రీకరణ భారతీయ వ్యవస్థని సరిగా అర్థం చేసుకోడానికి పనికొచ్చే తాత్త్విక కొలమానం. చరిత్రను ఆర్థిక విశ్లేషణకు పరిమితం చేసిన వారికి గొప్ప సవాల్‌ ఈ సూత్రీకరణ.

ఈ క్రమంలో మార్క్సిస్టులకు ఆయన కొన్ని ప్రశ్నల్ని సంధించారు. కొంతమంది అధికారానికీ, ఆర్థిక ఉన్నతికీ - మరికొంతమంది అగౌరవానికీ, పేదరికానికీ కారణమయిన కుల వ్యవస్థను కూలదోయకుండా ఇక్కడి ఆర్థిక వ్యవస్థను మార్చగలరా? భారత కార్మిక వర్గాన్నీ, పీడిత వర్గాన్నీ విప్లవంలో ఐక్యం కాకుండా అడ్డుపడుతున్నదేంటి? విప్లవానంతరం తమను మిగతా పైకులాల వారు గౌరవంగా సమానంగా చూస్తారనే భరోసా ఇక్కడి విప్లవ చోదక శక్తులకు ఉందా? లేనప్పుడు ఆ భరోసాను ఎలా కలుగజేయాలి? పీడనను పీడితులే సంరక్షించే ఏర్పాటును, అవమాన భారతాన్ని అవమానితులే కాపలా కాసే చట్రాన్ని, ఆకలిని ఆకలిలో దహించుకుపోయేవాళ్ళే కాపాడే దుస్థితిని పకడ్పందీగా పరిపాలించటంలోనే కులవ్యవస్థ క్రూరత్వం ఉంది. ఈ వైచిత్రిని నిరంతరం నడపడానికి కారణం కుల వ్యవస్థ సృష్టించిన గ్రేడెడ్‌ ఇనీక్వాలిటీలో ఉందని అంబేద్కర్‌ బయటపెట్టారు. అసమానుల మధ్య అంతరాల్ని పట్టుకు రావడం, అంతర శ్రేణులమధ్య నిచ్చెనమెట్ల అధికార సోపాన భ్రమల్ని కలిగిస్తూ పీడితుల్ని వాస్తవాలవైపు దృష్టి మళ్ళనీయకుండా చేయటంలోనే దోపిడీని శాశ్వతంగా శాసనీకరించిన కులవ్యవస్థ తత్వం ఉందని గుర్తించడం అంబేద్కర్‌ తాత్వికతకు హైలైట్‌. మార్క్సిస్టులు తరచూ చెప్పే పునాది-ఉపరితలాల సంబంధాన్ని భారత వాస్తవికతనుంచి చూస్తూ అంబేద్కర్‌ చేసిన విశ్లేషణ చూడండి. ‘ఆర్థిక సంబంధాల పునాదిమీద మత, సాంఘిక, రాజకీయ సంస్థలతో కూడిన మేడ నిలబడుతుంది అంటే పునాది ఎంత నిజమో మేడా అంతే నిజం. మనం పునాదిని మార్చాలనుకుంటే ముందు ఆ పునాది మీద నిర్మితమయిన మేడను కూలదోయాల్సి ఉంటుంది. అట్లాగే సమాజంలో ఆర్థిక సంబంధాల్ని మార్చాలనుకున్న వాళ్ళు అమలులో ఉన్న సాంఘిక రాజకీయ ఇతర సంస్థల్ని నిర్మూలించాలి’. ‘కమ్యూనిస్టు భ్రమ’ అనే శీర్షికలో రాసిన వ్యాసంలోని ఈ భాగం అంబేద్కర్‌ తాత్వికతను స్థూలంగా పట్టిస్తుంది.

కులవ్యవస్థకు దైవ సమ్మతిని అంటగట్టిన హిందూ పవిత్ర గ్రంథాల్నీ అందులోని తాత్వికతనీ ఎండగడుతూ అంబేద్కర్‌ వెలువరించిన రచనలు ఈ దేశ ప్రగతివాదులకే కాదు అన్ని దేశాల మేధావులకీ అనుసరణీయం. పవిత్ర గ్రంథాలు ప్రజల మనసుల్లో చిమ్మిన విష భావజాలంతో యుద్ధం చెయ్యమని ఆయన ఇచ్చిన పిలుపు కుల నిర్మూలనకొక తాత్విక పరిష్కారం. కులాంతర వివాహాలు మరొక పరిష్కారం. సాంఘిక హోదా ఆర్థిక స్థాయిని నడుపుతున్న వ్యవస్థకు విరుగుడుగా రిజర్వేషన్లకు ముందుకు తెచ్చారు అంబేద్కర్‌. పీడిత కులాలు హిందూ మతాన్ని వదిలి వెయ్యటం అసలు సిసలు పరిష్కారమనీ - బుద్ధిజం హిందూయిజానికి ప్రత్యామ్నాయమనీ అంబేద్కర్‌ విశ్లేషించారు. బుద్ధిజాన్ని స్వీకరించారు. రాజకీయ రంగంలో పీడిత కులాల రాజ్యాధికార భావనను తీసుకురావడంలో ఇమిడి ఉంది కూడా తాత్విక దృష్టే.'The emancipation of the mind and the soul is a necessary preliminary for the political emancipation of the people'

ఒక పక్క హిందూ పవిత్ర గ్రంథాల్లో, శాస్త్రాల్లో నమ్మకం ఉంచుకుంటూనే మరోపక్క ఉదారంగా ప్రగతిశీలంగా ఆధునికంగా ఉన్నామని ఎవరయినా అనుకోవడంలో వైరుధ్యం ఉన్నదని అంబేద్కర్‌ వాదన. గాంధీవాదులకీ, లెఫ్ట్‌వింగ్‌ హిందువులకీ ఇది వర్తిస్తుంది. గాంధీ విషయంలో ఆశ్చర్యం కలగక పోయినప్పటికీ ఎస్‌ఏ డాంగే విషయంలో అంబేద్కర్‌ చాలా ఆశ్చర్యాన్నీ దిగ్భ్రమనీ పొందారు. 1928లో బాంబే ప్రెసిడెన్సీలో జరిగిన కార్మికుల సమ్మె సందర్భంగా, కార్మికుల్లో దళిత కులాలకూ, మిగతా కులాలకూ మధ్య ఉన్న ఉద్యోగ హోదా వివక్షను రూపుమాపాలని అంబేద్కర్‌ డాంగేకు సూచించారు. దళితుల్ని వీవింగ్‌ సెక్షన్‌కు రానివ్వని వివక్షను రద్దు చేయడానికి డాంగే ఒప్పుకోరు. ఇది బ్రాహ్మణవాదం నుంచి బయటపడని అగ్రకుల కమ్యూనిస్టు నాయకుల మనస్తత్వానికి నిదర్శనంగా అంబేద్కర్‌ పసిగట్టారు. అందుకే నమ్మకం, విశ్వాసం, మూఢతల స్థానంలో హేతువు, వివేకం, వివేచనను అంబేద్కర్‌ బలపరిచారు. బుద్దిస్టు తత్వాన్నీ, యూరోపియన్‌ వికాసవాదాన్నీ కలపడం ద్వారా బుద్ధ భారతాన్ని నిర్మించాలని కాంక్షించారు. ఆయన సంపాదకత్వం వహించిన న్యూస్‌ పేపర్‌కి అంబేద్కర్‌ పెట్టిన పేరు ‘ప్రబుద్ధ భారత’. అంబేద్కర్‌ స్వీకరించిన బుద్ధిజం హిందూయూకరించబడిన బుద్ధిజం కాదు. అది ‘నవయాన’ బుద్ధిజం. అది ప్రపంచాన్నీ, సామాజిక రుగ్మతల్నీ అర్థం చేసుకునే ఒక పద్ధతి. ఒక జీవన విధానం. ప్రపంచాన్ని పునర్‌ నిర్మించే సాధనం 'The purpose of Dhamma is to reconstr-uct the world' అని అంబేద్కర్‌ ప్రకటిస్తారు.

ప్రస్తుత ప్రపంచాన్ని చూసినప్పుడు అటు ఆర్థికాన్నీ ఇటు రాజకీయాన్నీ ఒక ఊపు ఊపుతున్న మత బలాన్ని గమనిస్తాం. భారత దేశంలో సెక్యులరిజాన్ని చీదరించుకునే రాజకీయాల వెనుకా, ఆవు మాంసంను రాజకీయ పోరాట స్థానంగా మలుస్తున్న కాషాయం కదలికల్లో ఉన్నదీ హిందూ ‘మత’లబులే అని గమనించవచ్చు. చరిత్రను తిరగరాయడాలూ, ప్రశ్నించిన వాళ్ళను కాలరాయటాలు ,రోజువారిగా ఏం చెయ్యాలో, ఏం తినాలో నిర్దేశించటాలూ - ఇవన్నీ క్రమంగా హిందూ రాజ్యం వైపు దేశాన్ని తీసుకెళుతున్న సన్నివేశంలో - వీటి రంగు రుచి వాసనల్తో సహా పట్టించేది అంబేద్కర్‌ తాత్విక దృష్టే. కనుక అంబేద్కర్‌ని సొంతం చేసుకోవడమంటే ఆయన తాత్వికతను సొంతం చేసుకోవటం. సైడ్‌ హెడ్డింగ్‌ స్థానం నుంచి కుల సమస్యను మెయిన్‌ హెడ్డింగ్‌ స్థానంలోకి తీసుకు రావడం. మనుషుల్లోని మానసిక ‘అల్పత్వాన్ని’ అలాగే ఉంచి ఎన్ని విప్లవాలు చేసినా వాటివల్ల మానవీయ సమాజాలు ఏర్పడవని గుర్తించటం.

నిజంగా ఒక దేశ సామాజికమనస్తత్వ మార్పును పక్కన పెట్టి దాని భౌతిక వాస్తవికతని మార్చినా అందులో మానవీయ నవ సమాజం నిర్మితం కాదనడానికి నేటి రష్యా చైనాల పెత్తందరీ సంస్కృతిని అర్థం చేసుకుంటే సరిపోతుంది.

-జి. లక్ష్మీనరసయ్య




అంబేడ్కరిజం అంటే...?

 భారతీయ సమాజానికి సంబంధించినంత వరకూ అంబేడ్కరిజం మానవ విమోచనావాదం. పీడిత కులాల పక్షం వహించినట్లు పైకి కనిపించినా సారాంశంలో అంబేడ్కరిజం మొత్తం భారతీయులందరికీ చెందిన విముక్తి సిద్ధాంతం. కొంచెం విశాలదృక్పథంతో ఆలోచిస్తే అంబేడ్కరిజంలో మొత్తం ప్రపంచ మానవుల విముక్తికి సంబంధించిన మార్గం ఉంది. నిర్దిష్టం నుంచి సాధారణీకరణకు జరిగిన ప్రయాణం ఉంది. చాలామంది అగ్రకుల మేధావులు చెబుతున్నట్లూ, కొంతమంది బహుజన ఆలోచనాపరులూ అభిప్రాయపడుతున్నట్లు అంబేడ్కరిజం అస్తిత్వవాదం కాదు. కేవలం గుర్తింపు కోసం ఆత్మగౌరవం కోసం జరపాల్సిన పోరాటాలకీ, సిద్ధాంతాలకీ మాత్రమే అంబేడ్కరిజం పరిమితం కాలేదు. కుల వ్యవస్థ వల్ల మనుషులు మనషులుగా ఉండలేకపోతున్న పరిస్థితి నుంచీ, అధిక సంఖ్యాకుల్ని అన్నిరకాల అణచివేతకు గురిచేస్తున్న నిచ్చెన మెట్ల వ్యవస్థ నుంచి విముక్తి సాధించటం ద్వారా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రాతిపదికగా సమాజాన్ని పునర్న్మించుకోవాల్సిన ఆవశ్యకతనీ, తీరుతెన్నుల్ని అంబేడ్కరిజం అందిస్తుంది. ఇక్కడే అంబేడ్కరిజం అటు భారతీయ అగ్ర కులస్తులకీ, అంతర్జాతీయ జన సమూహాలకి కూడా అప్పీలయ్యే స్థాయిని తెచ్చుకుంది. అంబేడ్కర్‌ కులవ్యవస్థను క్రమబద్ధంగా విశ్లేషించి గతంలో జరిగిన కులవ్యతిరేక పోరాటాల్ని శాస్ర్తీయంగా అధ్యయనం చేశారు. గతంలో ప్రతిపాదించిన కులాల ఉద్ధరణ, అస్పృశ్యతా నిర్మూలనా అనే భావనలకున్న పరిమితుల్ని గుర్తించారు. తద్వారా కుల నిర్మూలన అనే కొత్త భావనను అందించారు.

అంబేడ్కరిజంలో విమోచనకు రెండు దారులున్నాయి. ఒకటి రాజకీయ విమోచన, రెండు మానసిక విమోచన. అంబేడ్కర్‌ అభివృద్ధి చేసిన పొలిటికల్‌ ప్రాగ్మాటిజంలో రాజకీయ విమోచన మూలాలున్నాయి. జాన్‌ డ్యూయీ ప్రతిపాదించిన వ్యావహారిక సత్తావాదం (pragmatism)కి చెందిన ఆచరణానుకూలత అంబేడ్కర్‌ని బాగా ప్రభావితం చేసింది. అలాగే అంబేడ్కర్‌ ప్రతిపాదించిన మానసిక విమోచన మూలాలు బుద్ధిజంలో ఉన్నాయి. మన సమాజ మార్పు కోసం, అంబేడ్కర్‌ తన జీవిత కాలంలో, ఈ రెండు విమోచనల్నీ సైమల్టేనియస్‌గా ఉపయోగిస్తూ పోయారు.

సమయ సందర్భాల్ని బట్టి వీటి ప్రాముఖ్యతలు మారుతూ ఉండటం – స్థానభ్రంశం చెందటం – అంబేడ్కర్‌ ఆచరణ క్రమంలో మనకి కనిపిస్తుంది. ఫలితంగా విలువలతో కూడిన పట్టువిడుపుల ధోరణి అంబేడ్కర్‌కు అలవడింది. తన దృష్టిలో సాధారణత కంటే నిర్దిష్టతకి ప్రాధాన్యం పెరిగింది. ఒక రకమైన సమాజ క్రమ పరిణామ వాదం అంబేడ్కర్‌కి హేతుబద్ధం అనిపించింది. ఒకేసారి సంభవించే సంపూర్ణ మార్పులో అంబేడ్కర్‌కి నమ్మకం లేకుండా పోయింది కనుక, ప్రయోగశీలత, సామాజిక ఫలితాలపై కేంద్రీకరించటం, సామాజిక మార్పుకు అవి ఉపయోగపడుతున్న తీరు మీద ఆధారపడి భావాలను అంచనా కట్టడాన్ని అంబేడ్కర్‌ ఆచరణలో పెట్టారు. ఇందులో భాగంగానే అస్పృశ్యుల విమోచనకి సాధనంగా విద్యని అంబేడ్కర్‌ భావించారు. పాఠశాలల్ని సామాజిక పరివర్తనా సాధనాలుగా పరిగణించారు. ఉన్నత విద్య దళితుల్ని రాజ్యాధికార సాధన వైపునకు నడుపుతుందని భావించారు. సమాజం అంచలంచలుగా మారుతూ సంపూర్ణ మార్పుని పొందుతుంది కనుక క్రమ సంస్కరణలే వాస్తవిక మార్గాలని ఆయన గ్రహించాడు. ఈ దేశంలో అత్యంత అణగారిన అస్పృశ్యులు విముక్తి పొందినప్పుడే ఇది సాధ్యపడుతుందని గుర్తించడంలోనేకాకుండా, ఇందుకు కులనిర్మూలన అవసరమని స్పష్టంగా భావించారు. అయితే ఇది విశాల సమాజం– ముఖ్యంగా అగ్రకులాల– మద్దతు లేకుండా సాధ్యం కాదని ఆయన గ్రహించారు. హిందువులు తమ పురాతన క్రూర ఆచారాల నుంచి బయటపడి, సంస్కరణలు సాగించే క్రమంలో కలిసి వస్తారని ఆశించారు. వాస్తవంలో ఇది సాధ్యపడలేదు.

అస్పృశ్యులకు ప్రత్యేక రాజకీయ అస్తిత్వాన్ని కల్పించటం దీనికి మార్గంగా ఆయన భావించారు. అస్పృశ్యులకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయటానికి అంగీకరిస్తూ బ్రిటిష్‌ ప్రధానమంత్రి ప్రకటించిన కమ్యూనల్‌ అవార్డును ఒక విజయంగా అంబేడ్కర్‌ పరిగణించారు. దీనికి గాంధీ ఆమరణ నిరాహార దీక్ష అడ్డుగా నిలిచింది. ఇది అంబేడ్కర్‌ని ఉమ్మడి నియోజకవర్గాలలో సీట్ల రిజర్వేషన్‌కి అంగీకరించేట్లు చేసింది. అస్పృశ్యులలోని కులాలు, ఉపకులాలను ఉద్దేశపూర్వకంగా విస్మరించి వారిని ఒక ఏకీకృత వర్గంగా పరిగణిస్తూ అంబేడ్కర్‌ తన రాజకీయ ప్రయత్నాన్ని మొదలుపెట్టినప్పటికీ – అనుభవ పూర్వకంగా – రాజకీయాలలో ఒక్క కులంపైననే ఆధారపడటం సాధ్యం కాదని ఆయన గ్రహించారు. ఈ గ్రహింపు నుంచే ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ (ఐ.యల్‌.పి)ని స్థాపించారు. ఈ పార్టీ ద్వారా ఎన్నికలలో చెప్పుకోదగ్గ విజయాల్ని అంబేడ్కర్‌ సాధించారు. అధికార బదలాయింపు కోసం జరుగుతున్న రాజకీయ సంప్రదింపుల నుంచి అంబేడ్కర్‌ని దూరంగా ఉంచడంలో అగ్రకుల రాజకీయాలు సక్సెస్‌ అయ్యాయి. అంబేడ్కర్‌ ప్రయత్నించి మొదట ముస్లిం లీగ్‌ సహాయంతో, ఆ తరువాత కాంగ్రెస్‌ సహాయంతో రాజ్యాంగ సభలో స్థానం సంపాదించగలిగారు.

రాజ్యాంగ ముసాయిదా డ్రాఫ్టింగ్‌ కమిటీకి అధ్యక్షుడిగా నియమించబడ్డారు. ఈ కాలంలో రాజ్య సోషలిజాన్ని ప్రతిపాదిస్తూ ‘స్టేట్స్‌ అండ్‌ మైనారిటీస్‌’ అనే పుస్తకాన్ని తీసుకొచ్చారు. రాజ్యాంగ ముసాయిదాను రూపొందించటానికి ఎన్నో రాజీలు పడాల్సి వచ్చింది. అస్పృశ్యుల రక్షణ కోసం, వారి భవిష్యత్తు భద్రత కోసం అంబేడ్కర్‌ డ్రాఫ్టింగ్‌ కమిటీలో పనిని ఎక్కువ భాగం స్వయంగా చేసినప్పటికీ, తయారయిన రాజ్యాంగం ఆయనకు సంతృప్తినివ్వలేదు. రాజకీయ విమోచనలో చివరి ప్రయత్నంగా ఆయన భారత రిపబ్లికన్‌ పార్టీని రూపొందించారు. సాంఘిక విముక్తికి రాజకీయ విముక్తి కీలకమని ఆయన ప్రకటించారు. అంబేడ్కర్‌ దృష్టిలో మానసిక విమోచన అంటే భౌతిక విమోచనే. ప్రజల మనసుల్ని హెచ్చుతగ్గుల భావజాలంతో నింపిన హిందూ మత సారం నుంచీ – దానికి సాంస్కృతిక సాధనమయిన బ్రాహ్మణ వాదం నుంచి – ఆ క్రమంలో కొనసాగుతున్న మానవ ఆర్థిక, రాజకీయ సంబంధాల నుంచీ ప్రజల మనసుల్ని బయటవెయ్యటమే మానసిక విమోచన. ‘కుల నిర్మూలన’ అనే గ్రంథంలో కులాల మూలాలు హిందూ ధర్మ శాస్ర్తాలలో ఉన్నాయి కనుక వాటిని ధ్వంసం చేయకుండా కులనిర్మూలన సాధ్యం కాదనే కంక్లూజన్‌కు అంబేడ్కర్‌ వచ్చారు. ఇది కుదిరే పని కాదు కనుక హిందూ మతాన్నే విడనాడాలని సంకల్పించారు. ముస్లింలతో దళితుల్ని పోలుస్తూ దళితుల మీద సాగించినట్లు ముస్లింల మీద హిందువులు దాడులు సాగించే సాహసం చేయరని ఆయన చెబుతారు. అందువల్ల దళితులు తమ బలానికి తోడుగా బయటి నుంచి మద్దతు కూడగట్టుకునే దిశగా ఆలోచించాలని అంబేడ్కర్‌ ఒక నిర్ధారణను ఇస్తాడు. ఈ విధంగా దళితులకు తమ మతాన్ని మార్చుకొని, గుర్తించదగిన సంఖ్యలో అనుయాయులు ఉన్న వేరే మతంలోకి చేరాల్సిన అవసరం ఉందని అంబేడ్కర్‌ నొక్కి చెబతారు.

మతమార్పిడి వల్ల వ్యక్తి ఔన్నత్యం పెరుగుతుందనీ, వ్యక్తి పుట్టుక స్వీయ విమోచన కోసమే అని ఆయన తేల్చి చెబుతారు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు 1956లో అంబేడ్కర్‌ బౌద్ధాన్ని ఎంచుకోవడం మనకు ఆశ్చర్యాన్ని కలిగించదు. కుల వ్యవస్థపై పోరాడే క్రమంలో రూపొంది, వికసన చెందటమే కాకుండా దానికి ఎన్నడూ లొంగని ఒకే ఒక భారతీయ మతం బౌద్ధం అనేది అంబేడ్కర్‌ అవగాహన. ఆయన దృష్టిలో క్రైస్తవం, ఇస్లాం, సిక్కు మతం భారతదేశంలో తమ సమూహాలలో కులవ్యవస్థ చోటుచేసుకోవడంతో రాజీపడ్డాయి. ఆయన దృష్టిలో బౌద్ధం ఒక్కటే రేషనాలిటీకీ, ఆధునిక విజ్ఞాన శాస్ర్తానికి సరిపోయే మతం. మూఢవిశ్వాసం, కట్టడి స్థానంలో వివేచన, మానవ సంబంధాలలో ప్రేమ, కరుణ, సంపూర్ణ సమానత అనే మూడు విలువలను బౌద్ధం బలంగా ప్రతిపాదించి ఆచరణలో పెట్టిందని అంబేడ్కర్‌ పేర్కొన్నారు. బౌద్ధాన్ని ఎంపిక చేసుకోవడంలో అంబేడ్కర్‌ ఉద్దేశం హిందూ మతాన్నీ, కులవ్యవస్థనీ సమూలంగా తిరస్కరించటమే కాదు అమలులోని బౌద్ధ సంప్రదాయాల్ని విమర్శనాత్మక దృష్టి నుంచి అంచనా కట్టడం కూడా.

విశ్వజనీన సత్యంతో హేతుబద్ద అవగాహనను జోడించిన ఒక మానవీయ సామాజిక మతంగా బౌద్ధాన్ని పునర్నిర్మించాలని అంబేడ్కర్‌ తలపెట్టారు. బౌద్ధాన్ని వ్యక్తిగత మోక్షాన్ని అందించే స్థాయి నుంచి సామూహిక విమోచన కోసం పాటించదగ్గ జీవన మార్గ స్థాయికి అంబేడ్కర్‌ అభివృద్ధి చేశారు. తన బౌద్ధాన్ని నవయాన బౌద్ధం అని పిలవటమే కాకుండా, నవయానను కేవలం దళితుల కోసమే ఉద్దేశించలేదు సమస్త మానవాళి కోసం ఒక విశ్వ సందేశంగా ప్రతిపాదించారు. అంబేడ్కర్‌ రూపొందించిన నవయాన బౌద్ధం మనుషులంతా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం విలువల ప్రాతిపదికగా జీవితాన్ని గడిపే ఒక మార్గం. అలాగే నవయాన బౌద్ధం మార్క్స్‌ ఊహించిన కమ్యూనిజానికి దగ్గరగా వస్తుంది. ఆధునిక జీవితంలో విస్తరిస్తూ పోతూ ఉన్న మానవ అవసరాలు మొత్తం మన మనుగడనే నాశనం చేసే స్థాయకి చేరుకున్నాయి. అల్ప వినిమయం ద్వారా, అన్ని జీవరాశుల పట్ల కరుణను వ్యాప్తి చెయ్యడం ద్వారా బౌద్ధం ఆధునిక సంక్షోభాలకు పరిష్కారమవుతుంది.

తన జీవిత కాలంలో అంబేడ్కర్‌ అటు రాజకీయ విమోచననూ, ఇటు మానసిక విమోచననూ సందర్భోచితంగా అన్వయిస్తూ తన ఉద్యమాన్ని సాగించారు. అంబేడ్కర్‌ ఆచరణని కానీ, సిద్ధాంతాన్ని కానీ పొలిటికల్‌ ప్రాగ్మాటిజం, సైకలాజికల్‌ మెటీరియలిజంల కలయికగా చూడటం ద్వారానే సరిగా అర్థం చేసుకోగలుగుతాం. అప్పుడే అంబేడ్కరిజం అస్తిత్వవాదం కాదనీ, అది మానవ విమోచన వాదమనీ తెలుస్తుంది. అంబేడ్కరిజం కేవలం అస్పృశ్యులకూ, ఇతర పీడిత కులాల ప్రజలకూ మాత్రమే కాక సకల జనుల సంకెళ్ళకు విరుగుడు. పీడితులే పీడనను పీడకులతో కలిసి సంరక్షించే కులవ్యవస్థకు, పేదవాళ్ళే పేదరికాన్ని పవిత్రంగా స్వీకరించే హిందూ మెట్ల వ్యవస్థకు, అణచివేతకు గురవుతున్న వాళ్ళే అణచివేతను కాపలాకాసే మాయా వాస్తవికతకు అంబేడ్కరిజం అసలు సిసలు పరిష్కారం.

జి. లక్ష్మీనరసయ్య

No comments:

Post a Comment