Monday, December 5, 2022

చరిత్ర గుండెలపై బుల్ డోజర్!

 చరిత్ర గుండెలపై బుల్ డోజర్!

ABN , First Publish Date - 2022-12-01T01:34:27+05:30 IST


భారత్, ప్రజాస్వామ్యానికి మాతృదేశం. ఈ శీర్షిక వినడానికి బాగుంది. ఏదైనా సరే, మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే, మన ఊర్లోనే పుట్టింది, మనమే, మొదటివారము అనే గుర్తింపులు సహజంగానే ఎంతో భావా వేశాన్ని...


చరిత్ర గుండెలపై బుల్ డోజర్!

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్

సం|| 93979 79750

భారత్, ప్రజాస్వామ్యానికి మాతృదేశం. ఈ శీర్షిక వినడానికి బాగుంది. ఏదైనా సరే, మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే, మన ఊర్లోనే పుట్టింది, మనమే, మొదటివారము అనే గుర్తింపులు సహజంగానే ఎంతో భావా వేశాన్ని కలిగిస్తాయి. ప్రజాస్వామ్యాన్ని మనం దిగుమతి చేసుకోలేదని, వేదకాలం నుంచి వారసత్వంగా పొందామని, అందుకని, ప్రజాస్వామ్యం పుట్టినిల్లుగా భారతదేశం ఘనతను చాటి చెప్పమని అన్ని యూనివర్సిటీలకు ఆయా రాష్ట్రాల గవర్నర్ల ద్వారా యూజీసీ ఆదేశాలు పంపింది. ప్రతిష్ఠాత్మకమైన భారత చరిత్ర పరిశోధనా మండలి (ఐసిహెచ్ఆర్) ఇందుకోసం ఒక సిద్ధాంత పత్రాన్ని రూపొందించి, ఏ ఏ ఉప అంశాల ద్వారా ఆ ఘనతను చెప్పవచ్చునో కూడా సూచించింది. ఇదంతా ఏ సందర్భంలో? నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం కోసమట: రాజ్యాంగ రచన పూర్తిచేసి సమర్పించిన సందర్భం కదా, నవంబర్ 26. ఆధునిక ప్రజాస్వామ్యదశలోకి భారత్ ప్రవేశించబోతున్నప్పుడు, అనేక పాయల జాతీయోద్యమం నుంచి సమకూర్చుకున్న అనేక ఆకాంక్షల, ఆదర్శాల, విలువల సంపుటి కదా రాజ్యాంగం? మరి రాజ్యాంగం ప్రసక్తి లేకుండా, డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ప్రస్తావన లేకుండా, ప్రజాస్వామ్యాన్ని పురాతత్వ అంశంగా మార్చడమేమిటని ఆశ్చర్యం కలుగుతుంది. చరిత్రకారులు, రాజనీతి శాస్త్ర పండితులు, రాజ్యాంగ నిపుణులు దిగ్భ్రాంతికి లోనుకావడం మరింత సహజం. సకల భావ రంగాల మీదికి బుల్డోజర్లు దూసుకువస్తున్నాయని బుద్ధిజీవులకు తెలుసు. బోధనలను, అభ్యసనాలను, అధ్యయనాలను తీర్చిదిద్దే విశ్వవిద్యాలయాలలో, ఈ రథచక్రాల వేగం ఉధృతంగా ఉంటుంది.


ఒక విశ్వవిద్యాలయం వారు ఆజ్ఞాపరిపూర్తిలో భాగంగా ఒక సదస్సు ఏర్పాటు చేసి, మిత్రుడు, సామాజిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిని ‘ఇండియా, మదర్ ఆఫ్ డెమొక్రసీ’ అన్న అంశం మీద మాట్లాడమన్నారు. శీర్షిక ఏదైనా ఉండనివ్వండి, నేను మాత్రం, ‘‘డాక్టర్ బిఆర్ అంబేడ్కర్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ డెమొక్రసీ’’ అన్న విషయం మీదే మాట్లాడతాను అని చెప్పి, ఆయన అట్లాగే ప్రసంగించారు. రాజ్యాంగ దినోత్సవం నాడు జరగవలసిన చర్చలు, సంభాషణల నుంచి అంబేడ్కర్ను, భారత రాజ్యాంగాన్ని, ఆధునిక ప్రజాస్వామ్యాన్ని మినహాయించడం అవాంఛనీయం, అన్యాయం అని చక్రపాణి అన్నారు. ఆయన ఒక్కరే కాదు, దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలలో జరిగిన కార్యక్రమాలలో, ఒక విస్మయం, కలవరం వ్యక్తమయ్యాయి. చరిత్రను ప్రక్షిప్తీకరించడం ఆదిమ, మధ్య యుగాల విషయంలో చేసినంత సులభంగా ఆధునిక యుగం విషయంలో సాధ్యం కాదన్న భ్రమ ఎవరికైనా ఉంటే అది మరింతగా సడలిపోవడం మొదలుపెట్టింది.


రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చర్చించడానికి చరిత్రపరిశోధన మండలివారు సూచించిన ఉపఅంశాలు కొన్ని చూడండి. రుగ్వేదంలో భారతీయ ప్రజాస్వామిక పరంపర మూలాలు; సభ, సమితి, వీటిలో భారతీయ ప్రజాస్వామిక సంప్రదాయం; ధర్మసూత్రాలు, ప్రజాతంత్రం; ఉపనిషత్తులు, పరిషత్తులు; పూర్వకాలంలో గణజనపదాలు, గణతంత్రం; భక్తి, ప్రజాస్వామిక సంప్రదాయాలు; ఖాప్ పంచాయత్లు, ప్రజాస్వామిక పరంపర, లిచ్ఛవి గణరాజ్యం; భారత్లో ప్రజాస్వామ్యం మూలాలకు పురాతత్వ ఆధారాలు... ఇందులో గణజనపదాలు, లిచ్ఛవి గణం గురించిన ప్రస్తావన ఉన్నది, కానీ, గణతంత్రాలను సామ్రాజ్యాలు మింగేస్తున్న కాలంలో, గణ ప్రజాస్వామ్య లక్షణాలతో భిక్షుసంఘాలను నిర్మించిన గౌతమబుద్ధుడు కానీ, పరస్పరతకు, సమష్టి జీవనానికి అత్యున్నత నైతిక ప్రమాణాలను నిర్ణయించిన వినయపిటకం కానీ, ఈ చరిత్ర మండలికి గుర్తు రాలేదు. అసలు దృష్టి బౌద్ధం మీద, బుద్ధుడి సమకాలం మీద కాదు. వేదకాలంలో ఉండిన సాముదాయిక వ్యవస్థ మీదే వారి గురి. పైగా, ఈ మధ్య కాలంలో, అదే పనిగా మతతత్వ చరిత్రకారులు చేస్తున్నట్టుగా, వైదిక కాలాన్ని, హరప్పా మొహంజోదారో నాగరికతను కలగలిపి, రెండూ ఒకటేనన్న వాదాన్ని ఐసిహెచ్ఆర్ సిద్ధాంత పత్రం కూడా తలకెత్తుకుంది. ప్రపంచవ్యాప్తంగా కనిపించే ఆధునిక ప్రజాస్వామ్యం అవతరణ వికాసాల నేపథ్యం పూర్తిగా వేరని, తొలినాటి సాముదాయిక వ్యవస్థలను చరిత్రాంశంగా అధ్యయనం చేయగలం కానీ, కొనసాగింపుగా భావించలేమని ఇప్పుడు విద్యా పరిశోధన రంగాలను ఆక్రమించిన కొత్తశక్తులకు తెలియదా?


మరి, భారతదేశంలో చరిత్ర తొలిరోజులలో ప్రజాస్వామ్యం లేదా? పూర్తి దేశీయమైన ప్రజాస్వామ్య చరిత్రను రాసుకోలేమా? అన్న సందేహాలు రావడం సహజం. చరిత్ర గమనాన్ని మనం ఎట్లా చూస్తామనే దానిపై ఆ ప్రశ్నలకు సమాధానం వెదుకవచ్చు. ప్రపంచంలో ప్రతి దేశంలోను లేదా జాతిలోను ఒక చారిత్రక ప్రయాణం జరిగే ఉంటుంది. ఒక సామూహిక, సమష్టి జీవన విధానం నుంచి తొలి అడుగులు మొదలై ఉంటాయి. హెచ్చుతగ్గుల భేదంతో కొన్ని సమాజాలు వివిధ రంగాలలో ముందడుగు వేసి ఉంటాయి. కొన్ని మానవ సమూహాలు ఇంకా వివిధ చారిత్రకదశలలోనే మిగిలిపోయాయి. ఆదిమ సాముదాయిక జీవనవిధానం ప్రపంచం నలుమూలలా తొలినాటి చరిత్రలలో చూడవచ్చు. కొన్నిచోట్ల తొలి ప్రజాస్వామ్యాలకు వ్యవస్థాగత రూపం కూడా కనిపిస్తుంది. వాటి నుంచి ఆధునిక ప్రజాస్వామ్యం స్ఫూర్తిని, సూక్తులను గ్రహిస్తుంది కానీ, వర్తమాన వ్యవస్థలు పూర్తిగా భిన్నమైన ప్రాతిపదికల మీద, ఆశయాల మీద నిర్మితమైనవి. గ్రీస్లో లాగా భారతీయ గణతంత్ర రాజ్యాలలో శిష్టవర్గం లేదని ఐసిహెచ్ఆర్ పత్రం రాస్తుంది. బుద్ధుడి కాలంలోని గణరాజ్యాలలో బానిసలు కూడా ఉన్నారని చరిత్ర చెబుతోంది. గ్రీస్, రోమ్ వంటి రాజ్యాలలో పుట్టిన తాత్వికత భారతదేశంలో పుట్టకపోవడానికి, మన ఆంతరిక అన్వేషణ కారణమట. సామాజిక అంతరాలను నిరసించిన బుద్ధుడి నుంచి ప్రతి మనిషికీ ఒకే విలువ అని చెప్పిన అంబేడ్కర్ దాకా తాత్వికతలో ఎంతో ప్రయాణం ఉంది, పురోగతి ఉంది.


హేతువాదం, వైద్యం, ఖగోళం, లోహాల వెలికితీత, రసాయనశాస్త్రం వంటి అంశాలతో కూడిన శాస్త్రవిజ్ఞానం మన దేశంలో చరిత్ర పూర్వయుగం నుంచి ఉన్నాయి. అటువంటప్పుడు, ప్రజాభాగస్వామ్యంతో కూడిన పరిపాలనా విధానాలు ఏదో ఒక రూపంలో ఉండకుండా ఎట్లా ఉంటాయి? గర్వపడదగిన చరిత్రను ఎవరు నిరాకరిస్తారు? కానీ, దురదృష్టవశాత్తూ, ఐసిహెచ్ఆర్ వారి సిద్ధాంత పత్రం, అటువంటి పరంపర గురించి మాట్లాడడం లేదు. ఆదర్శవంతుడైన రాజు గురించి, ఖాప్ పంచాయత్ల గురించి, గ్రామీణ స్వయం ప్రతిపత్తి వ్యవస్థల గురించి మాట్లాడమంటున్నది. విదేశీ వలసపాలన నుంచి విడివడడానికి జరిగిన ఆధునిక జాతీయోద్యమాన్ని పక్కకు పెట్టి, విదేశీయుల దండయాత్రల గురించి చెబుతున్నది. ప్రస్తుత రాజకీయ సంవాదంలో మితవాదశక్తులకు ముఖ్యమైన ఆయుధంగా ఉన్న మనము – ఇతరులు అన్న ద్వంద్వాన్ని చరిత్రకు కూడా ఆపాదించే ప్రయత్నం చేస్తున్నది. దండయాత్రలు, రాచరికాల మార్పు వంటి కారణాలకు చెక్కుచెదరకుండా భారతీయ గ్రామాలు నిలవడానికి గ్రామీణ ప్రజాస్వామ్యమే కారణమని చెబుతున్నది. అసలు భారతీయ గ్రామం నిజంగా శతాబ్దాల తరబడి స్థాణువుగా ఉన్నదా, బాహ్య ప్రభావాలకు లోనుకాలేదా అన్నది పెద్ద ప్రశ్న. గుప్తుల కాలమైనా, మొగలుల కాలమైనా, చివరకు నిజాముల పాలన అయినా, పాలకుడి పునాది గ్రామీణ భూస్వామ్యంలోనే ఉన్నది. అట్లాగే, గ్రామాలలో స్థానికంగా ఉండే పాలకవ్యవస్థ చరిత్రక్రమంలో మారకుండా లేదు. వివిధ దశలలో సామాజిక కర్కశత అధికంగా కనిపిస్తుంది. అనేక రాజకీయార్థిక మార్పుల కారణంగాను, సాంస్కృతిక ఉద్యమాల ప్రభావం వల్లనూ సామాజిక కూర్పులలో మార్పులు, ఉదారత్వ భావనలు అప్పుడప్పుడు కనిపిస్తాయి. భారతీయ గ్రామం సిగ్గుపడవలసిన చారిత్రక నేరం---– అస్పృశ్యత, కుల వివక్ష. భారతీయ గ్రామాల్లో లోపించిన సామాజిక ప్రజాస్వామ్యం గురించే కదా, అంబేడ్కర్ ఆవేదన చెందింది! కులవ్యవస్థ అనే విషం నిండిన నేల మీద, రాజకీయ ప్రజాస్వామ్యం ఎట్లా మనగలుగుతుందోనన్న భయాందోళనలను బాబాసాహెబ్ వ్యక్తం చేశారు. ఆ అప్రజాస్వామిక, కులోన్మాద వ్యవస్థనే కదా, ఐసిహెచ్ఆర్ భారతీయ ప్రజాస్వామ్య పరంపరగా ప్రశంసిస్తున్నది?


వేదాలు దివ్య సమన్వయాన్ని, ఉపనిషత్తులు అందరికీ జీవించే హక్కును, భగవద్గీత మానవవర్తనలో జ్ఞానం, విశ్వాసం, ఆచరణల సమ్మేళనాన్ని ప్రతిపాదించాయని, భారతదేశంలో ధర్మమే న్యాయమని రాసిన మాటలు చదువుతుంటే, ఐసిహెచ్ఆర్ డాక్యుమెంటు ఒక ఆధ్మాత్మికవాది రాసిన పత్రం లాగా కనిపిస్తుంది తప్ప, చరిత్రశాస్త్రజ్ఞుల ప్రతిపాదనల్లాగా కాదు. అనేక చోట్ల హిందూ, భారతీయ అన్న మాటలను పర్యాయపదాలుగా వాడారు. దండయాత్రలు చేసినవారిని, భారత్కు శత్రువులుగా కాక, హిందూ ధర్మానికి శత్రువులుగా పేర్కొన్నారు. ఇంతకీ ఈ ప్రయాస అంతా ఎందుకు పడుతున్నారు? భారత జాతీయోద్యమంలో నేటి పాలకుల పాత్ర లేనందువల్ల, మొత్తం జాతీయోద్యమాన్నే అప్రధానం చేస్తున్నారా? వలసవాద వ్యతిరేక పోరాటాన్ని, అందులో ముందుకు వచ్చిన నాయకులను, విలువలను తప్పించి, అసలైన దాడులు ఆది, మధ్యయుగాల్లోనే జరిగాయని, దానికి ఇప్పుడు తాము ప్రతిదాడులు చేస్తున్నామని చెప్పుకోవడం ఉద్దేశమా? సమానత్వం కానీ, ప్రజాస్వామ్యం కానీ భారతీయ ప్రాచీనతలోనే ఉన్నాయని చెప్పడం ద్వారా ఆధునిక సామాజిక, రాజకీయ సిద్ధాంతాలను నిరాకరిస్తున్నారా? రాజ్యాంగం చుట్టూ నిర్మితమవుతున్న ఆశలను, పోరాట ఆకాంక్షలను ఓడించడానికి, అంతిమంగా రాజ్యాంగాన్నే అతిసాధారణ గ్రంథంగా మార్చడానికి జరిగే ప్రయత్నంలో భాగమా? ఇన్ని, భయాలకు, సందేహాలకు ఆస్కారమిస్తున్నది ఒక చిన్న పత్రం. ఇక, కొత్త విజ్ఞానంతో తలమునకలైన మేధాకేంద్రాలలో మున్ముందు ఎన్ని విస్ఫోటక సత్యాలు ఆవిష్కృతమవుతాయో?


కె. శ్రీనివాస్

No comments:

Post a Comment