Monday, March 2, 2020

వలస బతుకుల్లో ‘పౌర’ కల్లోలం - పి. విక్టర్ విజయ్ కుమార్

వలస బతుకుల్లో ‘పౌర’ కల్లోలం - పి. విక్టర్ విజయ్ కుమార్

అక్రమ వలసదారులను క్రమబద్ధీకరించడానికి ఒక సాంఘిక దృక్పథం అవసరం. అది ఒక ప్రాథమిక ఆర్థిక దృక్పథంతో ముడిపడి వున్నది, ఉండాలి కూడా. పౌరసత్వ సవరణ చట్టం ఒక పోలరైజ్డ్ కోణంలో పార్లమెంట్ సాక్షిగా ఒక మతానికి చెందిన వాళ్ళను స్టీరియో టైప్ చేస్తున్నది. ఇది సమంజసం కాదు. పౌరసత్వ సవరణ చట్టాన్ని పునః పరిశీలించి, తగిన మార్పులు చేయవలసిన అవసరం ఎంతైనా వున్నది.

దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ)పై గొడవల్లో చోటుచేసుకున్న దారుణ హింసాకాండ 1984 సిక్కుల ఊచకోత అనంతరం సంభవించిన అతిపెద్ద మారణకాండ. ఆసక్తికరమైన విషయం ఏమంటే సిఏఏను వ్యతిరేకిస్తున్న తిరుగుబాటుదారులపై ఆ చట్ట మద్దతుదారులతో కలిసి పోలీసులూ రాళ్ళు రువ్వడం, దాడి చేయడం. ఇది, అన్ని టెలివిజన్ ఛానెల్స్‌లో ప్రసారమయిన పబ్లిక్ సీక్రెట్. మునుపెన్నడూ లేని విధంగా ఢిల్లీ కల్లోలం ఎందుకు సంభవించింది ? ముస్లింలు మినహా మిగతా మత మైనారిటీలకు అధికారికంగా ఆశ్రయం కల్పిస్తామని అభయమిస్తూ భారత ప్రభుత్వం ప్రప్రథమంగా ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. ఇదే సిఏఏ. అక్రమ వలసలు ప్రపంచంలో మన దేశం మాత్రమే ఎదుర్కొనే సమస్య కాదు. ఈ సమస్యను పరిష్కరించుకోవడంలో ఇంతవరకు ప్రతి దేశమూ కఠినంగానో, మృదువుగానో వ్యవహరిస్తూ వస్తోన్నది. అయితే దానికి ఒక మత కోణం కల్పించిన సందర్భం లేదు. సౌదీ అరేబియా లాంటి దేశాల్లో తమ మతానికి చెందిన అక్రమ వలసదారులను మొహమాటం లేకుండా డీటెయిన్ చేస్తున్నారు; డిపోర్ట్ చేస్తున్నారు.

ఇప్పుడు మన దేశం మిగతా దేశాలలోని మైనారిటీలకు ‘మెస్సయ్య’లా ఫోజుకొడుతూ పౌరసత్వ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చర్యను సమర్థించుకోవడానికి పాకిస్థాన్‌లాంటి దేశాలు మైనారిటీలను నరకయాతన పెడుతున్నట్టు మన పాలకులు విపరీతమైన కల్పిత కథనాలను ప్రచారం చేస్తున్నారు. చట్ట వ్యతిరేకంగా ఎవరైనా ఈ దేశంలోకి ప్రవేశిస్తే - అది చట్ట వ్యతిరేకం మాత్రమే. దాన్ని చట్టబద్ధం చేయడం ఒక మతానికి జాతికి సంబం ధించిన అంశం ఎలా అవుతుందో ఎవరికీ అంతు చిక్కని అంశం. అమెరికాలో అక్రమ వలసదారులు ఆ దేశ జనాభాలో 3 శాతం మేరకు వున్నారు. మన దేశంలో అక్రమ వలసదారుల విషయమై ఖచ్చితమైన డేటా అందుబాటులో లేదు. కొన్ని కాకి లెక్కల ప్రకారం 0.4% అంటే 50 లక్షల మంది ఉండొచ్చు. వీరిలో మూడొంతులమంది ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్‌లో నార్త్ ఉంటారని ఒక అంచనా. నిజానికి ఏ ప్రాతిపదికన ఇంతమంది మన దేశంలో చొరబడ్డారు అని ప్రభుత్వం ప్రాపగేట్ చేస్తుందో అందుకు ఎటువంటి సైంటి ఫిక్ డేటా చూపట్లేదు. నిజానికి చైనా–అమెరికా ట్రేడ్ వార్ పుణ్యమా అని బంగ్లాదేశ్ మన కంటే ఇంచుమించు రెండు రెట్లు ఆర్థిక వృద్ధి సాధిస్తోంది. బంగ్లాదేశ్ ప్రజల సగటు తలసరి ఆదాయం దాదాపుగా మన తలసరి ఆదాయ స్థాయిలోనే ఉన్నది. మరి ఎంతమంది ఆ దేశం నుంచి ఇల్లీగల్‌గా మన దేశానికి వస్తున్నారనేది ప్రశ్నార్థకమే.

పెరుగుతున్న నిరుద్యోగం, మతతత్వ అల్లర్లను తట్టుకోలేక భారత్ నుంచి తమ దేశానికి ఎంతో మంది అక్రమంగా వలస వస్తున్నారని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి అబ్దుల్ మొమెన్ స్వయంగా కారణాలు ఎత్తకుండా సెలవివ్వడం గమనార్హం. పైగా ‘మీకు సమస్యగా ఉంటే వ్యక్తులను గుర్తించి చెప్పండి. మేము ఉన్న పళాన వారిని తీసుకెళ్ళిపోతా’మని కూడా ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు. తద్వారా, భారత్‌కు బంగ్లాదేశ్ ఏదో విపత్తు తెచ్చి పెడుతుందనే మాటలు మాట్లాడటం శుద్ధ దండుగ అని ఆయన చెప్పకనే చెప్పారు.

అసలు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ సమస్య చాలా పెద్ద సమస్య అని అనుకుందాం. ఇందులో నిజ నిజాలు ఎంత వరకు ఆమోదించవచ్చో చూద్దాం. మన దేశ సరిహద్దులు అతిక్రమించబడుతుంటే మనం ఖచ్చితంగా అప్రమత్తమవ్వాలి. ఈ విషయంలో రెండో ఆలోచనకు తావు లేదు. అయితే సరిహద్దులను అత్రిమించి చొరబడడమనేది మన దేశంలోనే కాదు, అత్యంత కట్టడి విధానాలు కలిగిన అమెరికా లాంటి దేశాల్లో కూడా విస్తారంగా వున్నది. ఈ విషయంలో పర్ఫెక్ట్ సెక్యూరిటీ అన్నది లేదు. అయితే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎందుకు వస్తున్నారు అని గమనిస్తే - తమకు బతకలేని సందర్భం కలిగినప్పుడు, ఆర్థికంగా కుటుంబాలను పోషించుకోడానికి, అల్ప స్థాయి శ్రమ చేసి అయినా సరే జీవించడం ముఖ్యమని భావించిన వాళ్ళు మాత్రమే తామ మాతృదేశం నుంచి, ఇరుగు పొరుగు, సుదూర దేశాలకు గత్యంతరం లేని పరిస్థితుల్లో అక్రమంగా వెళ్ళడం జరుగుతోంది. ఇది ప్రపంచవ్యాప్త పరిణామం. ఇలా పొట్ట చేత పట్టుకుని వెళ్ళిన వారు తాము వెళ్ళిన దేశాలను కొల్లగొట్టి, ఆ దేశాలను పడగొట్టే ఒక ఆర్గనైజ్డ్ ఫోర్స్‌గా తయారయ్యింది లేదు. ఎందుకంటే -వీళ్ళు ఎటువంటి గుర్తింపు దొరకని, సోషల్ కేపిటల్ లేని జనాభా. ఒక మర్యాద పూర్వక జీవితం గడపాలనుకుంటే కొత్త సంబంధాలు, కొత్త సంస్కృతి అలవర్చుకుని నిలదొక్కుకోవాల్సిన జనాలు. వీళ్ళు అతి తక్కువ స్థాయిలో బతుకుతున్న వాళ్ళు. ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదిగే అవకాశం లేని వాళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ అభాగ్యులు మన దేశాన్ని ముంచేస్తారని లేని పోని అపోహలు ఊహలు సృష్టించే ప్రయత్నం పౌరసత్వ సవరణ చట్టం ద్వారా జరుగుతున్నది. అది కూడా ఒక మతానికి సంబంధించిన వారితోనే సమస్య, మిగతా వాళ్ళందరూ మంచోళ్ళే అని భావన కలిగించడం ఎటువంటి లాజిక్‌కు అంతు చిక్కని విషయం.

ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్‌కు సంబంధించి ఉండాల్సిన ఒక ప్రాథమిక దృక్పథం -ప్రతి కొత్త వ్యక్తి దేశంలో వినిమయదారుడై ఉండాలి. ఒక శ్రామికుడు లేదా ఉద్యోగి అయి ఉండాలి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్ శ్రామికుడు కాకపోయినా, లేదా వినిమయ దారుడు కాకపోయినా వచ్చిన వాడు పబ్లిక్ మీద ఆధార పడాల్సి వస్తుంది. ఆ వ్యక్తిని పోషించడమనేది పబ్లిక్‌కు ఎనలేని భారమవుతుంది. ఈ భారాన్ని మోయడానికి ఏ దేశమూ సిద్ధపడి ఉండదు. వలసదారుని శ్రమ ఉత్పాదన, ఫలితం అతని కుటుంబంతో పాటు వలస వచ్చిన దేశానికి అందాలి. అతను చేసే వ్యయం, అతని సంపాదన, అతని పొదుపు అన్నీ ఈ దేశంలో అనధికారంగా, unplanned గా సృష్టించబడ్డాయి కాబట్టి ఈ దేశానికి మాత్రమే పరిమితమయి ఉండాలి. ఏవి కూడా ఇక్కడి నుండి ‘ రీపేట్రియేట్’ చేయబడరాదు. ఇది వలసదారుల విషయంలో ఒక బేసిక్ దృక్పథం. ఇలాగే ఏ దేశం అయినా పాలసీ రూపకల్పనలు చేస్తుంది. లీగల్ ఇమిగ్రెంట్స్ ‘planned inflow’ గా ఉంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ‘unplanned inflow’ అవ్వడం వలన వాళ్ళ వలన ఆ దేశ సార్వభౌమత్వానికి ఎటువంటి ప్రమాదం కలుగకూడదు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి హాని జరగకూడదు. ‘live and let live’ అనే ఒక ప్రాథమిక ప్రజాస్వామిక దృక్పథమిది. ఇది వదిలేసి ప్రపంచ మైనారిటీలకు భారత దేశం ఒక మెస్సయ్య అన్నట్టు ఒక చట్టం కలిపించడం హాస్యాస్పదం, అసంబద్ధం కూడా.

ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ దేశంలోని ఉద్యోగాలను దొంగిలిస్తారు అనే ఒక అపోహ కూడా ఉంది. వీళ్ళు ఇల్లీగల్‌గా దేశంలోకి వచ్చి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను స్వాయత్తం చేసుకోలేరు కదా. వీళ్ళు సాధారణంగా ఏవైతే కష్టమైన పనులు ఉంటాయో, ఏవైతే తక్కువగా పరిగణించబడుతాయో ఆ పనులు చేసుకుంటారు. ఆస్తులు కూడగట్టుకోవడం కన్నా, ఒక మర్యాదకరమైన జీవితం గడపడానికే ప్రాధాన్యమిస్తారు. వీళ్ళలో కొంతమంది దేశభక్తులుగా ఉంటారని కొంతమంది దేశ వ్యతిరేకులుగా ఉంటారని ఊహిస్తూ ఒక చట్టం కల్పించడం అన్నది ఎటువంటి రాజకీయ తర్కాన్ని అనుసరించి జరుగుతుందో అంతు పట్టని విషయం. వలస వచ్చిన వారు ఏ దేశంలో అయినా మొదటగా లేబర్ సప్లైని పెంచుతారు. అందువలన ఆ శ్రమకు సంబంధించి జీతాలు తగ్గిపోతాయి. దీని వలన ఇక్కడి పేదవాళ్ళు నష్టపోతారు అనే విషయం చర్చించే ముందు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే - ఇక్కడ శ్రమ అవసరమైన వాళ్ళు అంటే చిన్న పెట్టుబడిదారులు, సంపన్న వర్గం ఇటువంటి శ్రామికుల సప్లైని అహ్వానించ దగిన పరిణామంగానే చూస్తారు. మన దేశ అసంఘటిత రంగంలో పనిచేస్తున్నవాళ్ళు ఏభైకోట్లకుపైగా వున్నారు. ఇందులో పది లేదా ఇరవై లక్షల ఉద్యోగాలు శ్రామికుల డిమాండ్ సప్లైని తారు మారు చేసే పరిస్థితే లేదు. అయితే ఈ శ్రామికులు ఒక చిన్న ప్రాంతంలో ఎక్కువగా కాన్‌సన్‌ట్రేట్‌ అయితే మాత్రం ఆ చిన్న భౌగోళిక ప్రాంతంలో మాత్రమే ఆ ప్రభావం ఉంటుంది. అది కూడా తాత్కాలికం. ఎందుకంటే,  అదే డిమాండ్, సప్లై తిరిగి సమతుల్యాన్ని సాధించాల్సిందే కాబట్టి. ఉదాహరణకు హైదరాబాద్ హోటళ్ళలో ఎక్కువగా ఒడిషా, బీహార్ నుంచి వచ్చి పని చేసే వెయిటర్లు కనిపిస్తారు. హోటల్ ఉద్యోగ రంగంలో వీళ్ళ వలన జరిగిన గందరగోళం ఏమీ లేదు. ఈ లేబర్ డిమాండ్, సప్లైని క్రమ బద్ధీకరించడానికే మన దేశం కనీస వేతన వ్యవస్థను అమలు పరుస్తుంది. అది సరిగ్గా అమలుపర్చకుండా, సీఏఏ లాంటి చట్టాలను గొప్ప రక్షక వ్యవస్థగా చూపించాలనుకోవడం అర్థం లేని విషయం.

ఈ చట్టం వలన ఇక్కడి ముస్లింలు మాత్రం తమ భారతీయ పౌరసత్వాన్ని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది! ఇది భయంకరమైన విషయం. నిజానికి ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్‌ను ఒక క్రమబద్ధంగా గుర్తించగలిగితేవాళ్లను qua– rantine చేసి ఒక చిన్న ఆర్థిక వ్యవస్థనే మలచవచ్చు. వీళ్ళందరు సాధారణంగా యవ్వన, మధ్య వయస్కులు అయి ఉంటారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా గమనించబడ్డ ఒక pattern. వాళ్ల శ్రమతో వాళ్ళు కలుగజేసిన డిమాడ్‌కు ఉత్పత్తులు తయారుచేయగలిగే వ్యవస్థను నిర్మించవచ్చు. నిజానికి ఒక రకంగా అమెరికా కెనడా లాంటి దేశాలు యుగాలుగా చేస్తున్న పని ఇదే. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్‌ను లీగలైజ్ చేస్తూ ఒక పద్దతి ప్రకారం ముందుకు వెళుతున్నారు. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్ ఈ క్రమంలో ఎదిగిన వాడే. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ భాగస్వామ్యం 3–5 శాతం ఉండొచ్చని ఒక అంచనా.

దీనర్థం మన దేశంలోకి ఎవరు పడితే వాళ్ళు రావచ్చని కాదు. కసబ్ లాంటి వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కిందకు రారు. టెర్రరిస్టులు లీగల్‌గా బతికినా టెర్రరిస్టులే. పక్క దేశాల నుండి వచ్చిన మెజారిటీ మతస్థులు మన దేశంలో సృష్టించిన ప్రత్యేక సమస్యలు ఏమున్నాయనే విషయమై ప్రభుత్వం ఇంతవరకు పార్లమెంటులో వివరించనే లేదు. మరే ఇతర ఫోరంలోనూ ఆ అంశంపై చర్చించడం జరగలేదు. ఈ అన్ డాక్యుమెంటెడ్ పౌరులను క్రమబద్ధీకరించడానికి ఒక మౌలిక సాంఘిక దృక్పథం అవసరం. ఆ సాంఘిక దృక్పథం ఒక ప్రాథమిక ఆర్థిక దృక్పథంతో ముడిపడి వున్నది. ఉండాలి కూడా. అయితే ఈ సీఏఏ చట్టం ఒక పోలరైజ్డ్ కోణంలో పార్లమెంట్ సాక్షిగా ఒక మతానికి చెందిన వాళ్ళను స్టీరియో టైప్ చేస్తున్నది. ఇది సమంజసం కాదు. పౌరసత్వ సవరణ చట్టాన్ని పునః పరిశీలించి, తగిన మార్పులు చేయవలసిన అవసరం ఎంతైనా వున్నది. ఇందుకు పార్లమెంటులో అఖిల పక్ష కమిటీ నొక దాన్ని ఏర్పాటు చేయాలి. ఇది తక్షణమే జరగాలి.

ఈ చట్టం మన దేశ వైవిధ్య సంస్కృతిలో ఐక్యతని సవాల్ చేస్తుంది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే మన దేశంలో అక్రమంగా చొరబడ్డవారు అని కాదు. మన దేశంలోకి గతిలేక ప్రవేశించినవారు అనే మానవతా దృక్పథంతో మనం ఈ సమస్య పరిష్కారానికి పూనుకోవాలి. మన దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందుతున్నది. గత్యంతరం లేక మన దేశానికి వచ్చినవారు ఇందులో పౌరులుగా భాగస్వాములు కావడానికి మనం అను మతించాలి. అప్పుడు మన దేశం ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థగా మాత్రమే కాక, మహోన్నత ప్రజాస్వామిక వ్యవస్థగా కూడా గౌరవం పొందుతుంది.

No comments:

Post a Comment